Kalyanram_Amigosస్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన కెరీర్ ప్రారంభంలో అవకాశాలు వస్తాయేమో కానీ నిలదొక్కుకోవాలంటే మాత్రం టాలెంట్ పుష్కలంగా ఉండాలి. అదేంటో ఈ రెండూ ఉన్నా కళ్యాణ్ రామ్ తో సక్సెస్ ఎప్పటికప్పుడు దోబూచులాడుతూనే ఉంటుంది. అలా అని ప్రయత్న లోపమా అంటే అదీ లేదు. పోనీ రొటీన్ కథలు చేస్తూ దెబ్బ తింటున్నాడా అంటే అదీ కాదు. తన ఈడు స్టార్లతో పోలిస్తే డిఫరెంట్ వే ఎంచుకుంటున్నాడనేది స్పష్టం. అతనొక్కడే, పటాస్, 118 లాంటి హిట్లు తరచుగా పడుతున్నా స్థిరమైన మార్కెట్ ని పెంచుకుంటూ పోవడంలో మాత్రం తడబడుతున్నాడు. అలా అని రెగ్యులర్ రూట్లోకీ వెళ్లడం లేదు.

కళ్యాణ్ రామ్ కు తమ్ముడు తారక్ బాబాయ్ బాలయ్యల సపోర్ట్ ఎంత ఉన్నా వాటిని అతిగా వాడిన దాఖలాలు లేవు. ఒకపక్క నిర్మాణ సంస్థని నిర్వహిస్తూనే మరోపక్క హీరోగా తనకు నప్పే స్క్రిప్ట్ లను ఎంచుకోడంలో మంచి మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. బింబిసార దానికి మంచి ఉదాహరణ. కొత్త దర్శకుడిని నమ్మి అంత పెద్ద గ్రాండియర్ ని చేతిలో పెట్టడమంటే రిస్కే. దానికి తోడు ప్రొడక్షన్, కరోనా వల్ల ఆలస్యం తదితర కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తీరా చూస్తే ఊహించిన దానికన్నా అద్భుత ఫలితం దక్కింది. మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్న టైంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం కంటెంట్ ని నమ్మడమే

తాజాగా అమిగోస్ తోనూ అదే ఋజువు చేస్తున్నాడు. ఇప్పటిదాకా వచ్చిన ట్రిపుల్ రోల్ సినిమాలన్నీ దాదాపుగా కవలల కాన్సెప్ట్ తో రూపొందినవే. జై లవకుశలో తారక్ చేశాడు కానీ రావణ పాత్రను పక్కనపెడితే మిగిలినదంతా రెగ్యులర్ ఫార్ములా వ్యవహారం. కానీ అమిగోస్ అలా లేదు. సామాన్య జనానికి ఏ మాత్రం అవగాహన లేని డాప్లర్ గ్యాంగ్ కాన్సెప్ట్ ని తీసుకుని దాని చుట్టూ మూడు పాత్రలను అల్లుకుని కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి విభిన్నంగా ప్రయత్నించిన ఫీలింగ్ టీజర్ చూసినవాళ్లుకు కలిగింది. అందులోనే ఒకటి నెగటివ్ షేడ్స్ ఉన్నది కావడం మరో ట్విస్ట్.

ఆ తర్వాత వచ్చే డెవిల్ కూడా బ్యాక్ డ్రాప్ పరంగా ఇంకా డిఫరెంట్. బ్రిటిషర్ల ఆట కట్టించడానికి వాళ్ళకే గూఢచారిగా మారే పీరియాడిక్ డ్రామాలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. విజువల్స్ మేకింగ్ అన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. నాలుగు పాటలు మూడు ఫైట్ల ధోరణికి దూరంగా కళ్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయాణం బాగానే ఉంది. ఈ ప్లానింగ్ ని ఇలాగే కొనసాగితే వందల కోట్ల బిజినెస్ రేంజ్ కి చేరొచ్చు చేరకపోవచ్చు. కానీ అందరిలాగా వెళ్లడం లేదనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది. రాబోయే రెండు సినిమాల ఫలితాలు తన నిర్ణయాన్ని ప్రభావితం ఏ మేరకు చేస్తాయో చూడాలి