Amigos Movieమాములుగా డబుల్ ఫోటోల సినిమాలు డీల్ చేయడమే పెద్ద రిస్క్. ఎంత జాగ్రత్తగా రాసుకున్నా ఒక పాత్రకే అధిక ప్రాధాన్యం ఇచ్చి కథలో సెంట్రల్ పాయింట్ గా మార్చక తప్పదు. ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ, నాగార్జున ఇలా ఎవరి ఉదాహరణ తీసుకున్నా పదే పదే ఇదే ఋజువవుతూ వచ్చింది. అలాంటిది ఒకే హీరో మూడు క్యారెక్టర్లంటే తమాషా కాదు. దానవీరశూరకర్ణ లాంటి ఇతిహాసగాధ అయితే ఇబ్బంది లేదు. కానీ కమర్షియల్ డ్రామాలో అలా కుదరదు. అయినా దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఏదో కొత్త ట్రై చేద్దామని అమిగోస్ రాసుకున్నాడు. ఎప్పుడూ ఇదే యాంగిల్ లో ఆలోచించే కళ్యాణ్ రామ్, మైత్రి లాంటి బడా నిర్మాతలు దొరికారు. ఇంకేం మూవీ రెడీ.

డొప్పెల్ గ్యాంగ్ అనే కాన్సెప్ట్ కొత్తదే. అందులో అనుమానం అక్కర్లేదు. రక్తసంబంధం లేకుండా వేరే ఎక్కడో అచ్చం మనలాగే ఉండేవాళ్ళకు ఈ పదం ఉపయోగిస్తారు. గూగుల్ లో కొడితే దీని గురించి బోలెడు సమాచారం ఉంది. సో రాజేంద్ర లాజిక్ గానే ఆలోచించాడు. సిద్దార్థ్, మంజునాథ్(కళ్యాణ్ రామ్)అనే ఇద్దరి మంచోళ్ళు మధ్య మైఖేల్(కళ్యాణ్ రామ్) వస్తాడు. ముగ్గురు కలిసి సరదాగా కాలం గడుపుతారు. అయితే మైఖేల్ వచ్చింది స్నేహం కోసం కాదని స్వార్థంతోనని తెలిసేసరికి అతని దారుణమైన వికృత నేపధ్యం బయటపడుతుంది. ఇక అక్కడి నుంచి పిల్లి ఎలుకా చెలగాటం షురూ. మధ్యలో కుటుంబ సభ్యులు ఇరుక్కుంటారు.

అమిగోస్ పూర్తిగా కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో. దర్శకుడు రాజేంద్ర హీరోలోని బెస్ట్ పెర్ఫార్మన్స్ ని బయటకి తీయడానికి అన్నట్టు పూర్తిగా గ్యాంగ్ స్టర్ పాత్ర మీదే ధ్యాస పెట్టడంతో మిగిలిన రెండు క్యారెక్టర్లు తేలిపోయాయి. దాంతో నెగటివ్ షేడ్స్ లో కనిపించినంత గొప్పగా గుడ్ బాయ్ డ్రెస్సులో ఒదగలేకపోయాడు. కాన్సెప్ట్ ఏదైనా కథను విలన్ కోణంలో చెప్పాలనుకున్నప్పుడు దాన్ని మెల్లగా హీరో వైపుకి తీసుకొచ్చి చెడు మీద మంచి గెలిచిందనే మెసేజ్ తో ముగిస్తే సగటు మాస్ ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. అంతే తప్ప థ్రిల్లర్ తరహాలో మోతాదు మించిన సస్పెన్స్ ని క్రియేట్ చేస్తే ఆ జానర్ ని ఇష్టపడేవాళ్ళు తప్ప మాములు ప్రేక్షకుడు ప్రత్యేకంగా ఫీలవ్వడు.

విపరీతంగా విసుగు పుట్టించకపోయినా అమిగోస్ లో ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం ప్రధాన లోపం. కామెడీని వదిలేద్దాం. లవ్ ట్రాకే కన్విన్సింగ్ గా అనిపించదు. ఏదో మొక్కుబడిగా సాగుతుంది. మైఖేల్ నిజ స్వరూపం తెలిశాక జరిగే సంఘటనలు ఈజీగా ఊహించుకునేలా ఉంటాయి తప్ప మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఒక్క సీనూ లేకపోయింది. అక్కడక్కడా పేలిన ట్విస్టుల వల్ల సెకండ్ హాఫ్ రక్షించబడింది కానీ లేదంటే ఇంపాక్ట్ లెవెల్ ఇంకా కిందకు వెళ్ళేది. బింబిసార లాంటి ఫాంటసీ ఎంటర్ టైనర్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి ఇంత సీరియస్ నెగటివ్ డ్రామాని చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా లేరు. బహుశా ఈ అంశమే ప్రధానపాత్ర పోషించి బాక్సాఫీస్ ఫలితాన్ని శాశించినా ఆశ్చర్యం లేదు.