nandamuri-kalya-ram-naa-nuvve-first-glimpseనందమూరి కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల సినిమాలంటే ఎక్కువగా కత్తి పట్టుకుని అటు పది మంది, ఇటు పది మందిని నరకడమో, నాలుగు సీమ పవర్ డైలాగ్ లు చెప్పడమో ఉంటాయి తప్ప… ‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’లను చేయరన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి ప్రయోగాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోతున్నాడన్న విషయం “నా నువ్వే” ఫస్ట్ గ్లిమ్స్ స్పష్టం చేసింది. ‘లవ్ లవ్ లవ్…’ అంటూ తమన్నా పలికే స్వరంతో ప్రారంభమైన ఈ గ్లిమ్స్ అంతా ప్రేమలో మునిగి తేలింది.

గ్లాసెస్ పెట్టుకుని క్లాస్ లుక్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కళ్యాణ్ రామ్ – తమన్నాల జోడి సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకురానుండగా, పీసీ శ్రీరాం కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. 43 సెకన్ల ఈ గ్లిమ్స్ ప్రతి ఫ్రేంలోనూ పీసీ శ్రీరాం కనపడుతుంటాడు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది. మరి ఈ డిఫరెంట్ లుక్ లో కళ్యాణ్ రామ్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.