Nandamuri Harikrishna final ritesఎన్టీఆర్‌ ‘చైతన్య రథాన్ని’ ముందుండి నడిపించి ‘చైతన్య రథ సారథిగా’ ఖ్యాతి గడించిన నందమూరి హరికృష్ణ చివరికి కారు నడుపుతూనే ప్రాణాలు కోల్పోయి తన సారథ్యానికి శాశ్వతంగా విరమించారు. ఆయన తన చివరి మజిలీ అయిన మహాప్రస్థానం నకు కూడా అంతే రాజసంగా కదిలి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలనుండి వేలాదిగా వచ్చిన అభిమానులు జోహార్ హరికృష్ణ జోహార్ ఎన్టీఆర్ అంటూ వీడ్కోలు పలికారు.

సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడే మోసి ఆయనను అంతే ఠీవిగా సాగనంపారు. ఆ తరువాత అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, జస్టిస్ చలమేశ్వర్, బాలకృష్ణ ఆయన పార్దీవ దేహం పక్కన నిలుచున్నారు.

అంతకు ముందు హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు. కుటుంబ సభ్యులతో రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు సైతం కాలి నడకన ఆయన చివరి ప్రయాణంలో జత కలిశారు. దాదాపుగా 10 కిలోమీటర్ల పాటు సాగిన చివరి ప్రయాణం రోడ్లకు ఇరువైపుల అభిమానులతో నందమూరి రాజసమంటే అది అనిపించేలా సాగింది.

అయితే అప్పుడే మృత్యువు ఆయనను అక్కున చేర్చుకోవడం మాత్రం ఎవరూ జీర్ణించుకోలేనిది. సాయంత్రం 4.కు మహాప్రస్థానం చేరుకున్న ఆయన పార్దీవ దేహానికి కన్నీటితో కొడుకు కళ్యాణ్ రామ్ తలకొరివి పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అదే విధంగా మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.