Nandamuri Hari Krishnaతెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, నందమూరి కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు అంతా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే ఇంతమందిలో తన స్పెషాలిటీ ఉండాలనుకున్నారో ఏమో గానీ, వివాదాలకు దూరంగా జరుపుకుంటున్న ఎన్టీఆర్ జయంతి రోజు హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తిరుపతిలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ వర్గాలు జరుపుకుంటున్న ‘మహానాడు’కు దూరంగా ఉన్న హరికృష్ణ, తన కొడుకు కళ్యాణ్ రాం, మరో నందమూరి వారసుడు తారకరత్నలతో కలిసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా ఏపీకి దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’ గురించి మీడియా వర్గీయులతో ఓ రేంజ్ లో వ్యాఖ్యానించారు.

‘ప్రత్యేక హోదా’ ఇస్తామని చెప్పిన వారు ఏం చేస్తున్నారో అంటూ బిజెపిని విమర్శించిన హరికృష్ణ, తెస్తామని చెప్పిన వారు ఏం చేస్తున్నారో అంటూ తెలుగుదేశం పార్టీపై కూడా పరోక్ష విమర్శలు చేసారు. ‘ప్రత్యేక హోదా’పై ఇంటికొరకు చొప్పున ఉద్యమించాలని కూడా పిలుపునిచ్చారు. అంతేకాదు, ప్రత్యేక హోదా సాధించిన రోజే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అంటూ ఓ ప్రత్యేక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ‘ప్రత్యేక హోదా’ సాధన కోరుకోవడం తప్పుకాదు, దానికి ఉద్యమించాలన్న విషయం కూడా విమర్శించదగినది కాదు.

కానీ, దేనికైనా సమయం, సందర్భం అవసరం. సందర్భం లేకుండా చేసే వ్యాఖ్యలు కేవలం వారి అమాయకత్వాన్ని సూచిస్తుంది తప్ప ప్రయోజనం శూన్యం అన్న విషయం మోహన్ బాబు ఉదంతలాలో చాలా సార్లు రుజువైంది. ప్రస్తుతం హరికృష్ణ గారు కూడా అలాంటి బాటలోనే పయనిస్తున్నట్లుగా కనపడుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజును జరుపుకునే ఉత్సాహంలో అభిమానులంతా నిమగ్నమై ఉంటే, అదే ఎన్టీఆర్ ఘాట్ వేదికగా రాజకీయాలు చేయడం ఏ మాత్రం సబబో ఒక్కసారి ఆలోచించుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది.

‘ఎన్టీఆర్ కు అసలైన నివాళి – ప్రత్యేక హోదా సాధనే’ అంటూ అర్ధం పర్ధం లేకుండా వ్యాఖ్యానించడం ఓ విధంగా ఆ మహానుభావుడి అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది. అసలు ‘విభజన’ లేకుండా అంతా కలిసి మెలిసి ఉండాలని భావించిన వ్యక్తి ఎన్టీఆర్. మరి ‘విభజన’ జరిగిన తర్వాత ఏపీకి దక్కాల్సిన అంశం ‘ప్రత్యేక హోదా.’ ఈ రెండింటికి ఎన్టీఆర్ తో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమో హరికృష్ణ గారికైనా తెలుసా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నిజానికి ఇవే వ్యాఖ్యలు ఇటీవల కేంద్ర మంత్రులు చేసిన సమయంలో హరికృష్ణ వ్యాఖ్యానించినట్లయితే పూర్తి ప్రాధాన్యత దక్కేది, హరికృష్ణపై ఒక గౌరవ భావం ఏర్పడేది. అలా కాకుండా ఎన్టీఆర్ జయంతి రోజునో, వర్ధంతి రోజునో మీడియా ముందుకు వచ్చి ఓ నాలుగు మాటలు మాట్లాడితే సరిపోతుందా? బహుశా ఇలా సమయం, సందర్భం లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీ హరికృష్ణను పక్కన పెట్టింది అన్న వ్యాఖ్యలకు ఈ సందర్భంగా బలం చేకూరుతోంది.