hari krishnaనందమూరి తారక రామారావు స్వర్గస్తులై 2016, జనవరి 18 నాటికి 19 సంవత్సరాలు ముగుస్తుంది. అయినా ఇప్పటికీ ఆ పేరు తెలుగునాట ఉన్న రెండు ముఖ్యమైన విభాగాల(సినిమా, రాజకీయాల)ను శాసిస్తోంది. తాజాగా జరిగిన జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో వేడుక “నందమూరి తారక రామారావు” అన్న పేరు ప్రభావం ఏమిటో మరోసారి చాటిచెప్పింది.

ఈ వేడుకపై ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలమైన కధనాలకు దారి తీసాయి. “నాన్నకు ప్రేమతో” టైటిల్ ను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో… తనకు నాన్నకు ఉన్న సంబంధానికి బదులు, తన కొడుకులకు నాన్నకు ఉన్న సంబంధాలను ప్రస్తావించారు హరికృష్ణ. తనకున్న ముగ్గురి సంతానంలో మొదట ఇద్దరికీ పేర్లు పెట్టాల్సిందిగా తన తండ్రి వద్దకు తీసుకువెళ్లగా, ముందు తరం వారికి ‘కృష్ణ’ అనే పేర్లు పెట్టాను… ఈ తరమంతా కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి పెట్టుకోమని ఆయన చెప్పినా… లేదు మీరే పెట్టాలి అన్నాను… అప్పుడు పెద్దవాడికి జానకిరామ్, రెండవ వాడికి కళ్యాణ్ రామ్ అని పేర్లు పెట్టారని హరికృష్ణ చెప్పారు.

ఇక, ‘విశ్వామిత్ర’ షూటింగ్ సమయంలో ఉన్నపుడు, తానూ షూటింగ్ కు వెళ్ళగా, ‘ఎలా ఉన్నాడు మూడవ కొడుకు? ఒక్కసారి తీసుకురమ్మని అడుగగా, అప్పటికీ నేను జూనియర్ కు ‘తారక్ రామ్’ అనే పేరును పెట్టానని, అయితే నాన్నగారు జూనియర్ ను చూసిన తర్వాత, ‘నీ పేరేంటి?’ అని అడిగితే ‘తారక్ రామ్’ అని నేను చెప్పానని, ఇదేంటి బ్రదర్… ఆ పేరు కాదు, నా పేరే ఈయనకు పెట్టాలి అని స్వయంగా ఆయనే ‘నందమూరి తారక రామారావు’ అని పేరు పెట్టి ఆశీర్వదించారని హరికృష్ణ తెలిపారు. అలాగే ‘విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో బాలనటుడిగా నాన్న గారితో కలిసి నటించాడని తీవ్ర ఆవేదనతో హరికృష్ణ వ్యాఖ్యానించడం పలు చర్చలకు దారి తీసింది.

ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసి, టాలీవుడ్ లో ఒక అగ్ర నటుడిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ “పేరు” గురించి ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తాతకు – మనవడికి ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ, హరికృష్ణ ఉద్వేగంతో ప్రసంగిచడం వెనుక “ఆంతర్యం,” స్వర్గీయ ఎన్టీఆర్ కు నటవారసుడిగా జూనియర్ ను తెర పైకి తీసుకురావడానికేనా? అన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే వాస్తవ పరిస్థితులను గమనిస్తే… ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇప్పటికీ సినిమాలలో కొనసాగుతున్న బాలకృష్ణ కెరీర్ దాదాపుగా తుది దశకు చేరుకుంది. బహుశా మరో రెండేళ్ల పాటు మాత్రమే బాలయ్య బాబు సినీ ప్రయాణం సాగవచ్చు. ఈ లోపున ఆయన తనయుడు మోక్షజ్ఞ సినీ తెరంగ్రేటానికి తెర వెనుక రంగం సిద్ధమవుతోంది. “వారసత్వం” మరో తరానికి చేరబోతున్న ఈ తరుణంలో ఎలాగైనా ‘ఎన్టీఆర్’ వారసత్వాన్ని ‘జూనియర్’ సొంతం చేయాలనే తపన హరికృష్ణలో స్పష్టంగా కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

హరికృష్ణ ప్రసంగం ఇలా ఉంటే, ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు కూడా హరికృష్ణ అభిప్రాయాలను సమర్థించే విధంగా ఉన్నాయి. ఒక కొడుకుగా ఎన్టీఆర్ కు విశేషమైన సేవలు చేసింది తన తండ్రి హరికృష్ణ ఒక్కరేనని కళ్యాణ్ రామ్ చెప్పడం… అభిమానులను హరికృష్ణ కుటుంబం వైపుకు తిప్పుకోవడానికేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం కోసం తన తండ్రి 35 సంవత్సరాలు కష్టపడ్డారని, అసలు మా నాన్న ఎలా ఉంటారో తనకు 10 సంవత్సరాల వరకు తెలియదని అభిమానులను భావోద్వేగాలకు గురిచేసారు కళ్యాణ్ రామ్.

ఈ వేడుకపై జరిగిన పరిణామాలు అందరికీ ఓ స్పష్టతను అయితే ఇవ్వగలిగిందని, ఇప్పటివరకు హల్చల్ చేసిన బాలకృష్ణ – జూనియర్ విభేదాలను “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుక ధృవపరిచిందని పరిశీలకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. ఈ “వారసత్వం” కోసం జరిగే ఈ పాకుల్లాటను బహుశా పై నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎలా చూస్తారో గాని, నిస్వార్ధమైన ఆయన అభిమానులు మాత్రం… ‘వారసత్వం’ కోసం అంతటి మహనీయుడిని బజారుకీడ్చవద్దని కోరుతున్నారు.