Veerasimha Reddyనిజ జీవితంలో రాయలసీమ పగలు ప్రతీకారాలు సినిమాల్లో చూపించే స్థాయిలో ఉన్నాయో లేదో కానీ ఈ సబ్జెక్టు మాస్ ఆడియన్స్ కి ఎప్పుడూ కిక్ ఇచ్చేదే. అందుకే పాతికేళ్ల క్రితం వచ్చిన సమరసింహారెడ్డితో మొదలుకుని అయిదేళ్ల క్రితం రిలీజైన అరవింద సమేత వీర రాఘవ దాకా ఎన్నో హిట్లు పడ్డాయి. మనకే కాదు తమిళంలోనూ ఇవి వర్కౌట్ అయిన దాఖలాలు ఎక్కువ. విశాల్ కు ఇమేజ్ వచ్చేలా చేసిన పందెం కోడిలో ఉన్నది ఈ బ్యాక్ డ్రాపే. క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ సైతం అంతఃపురం కోసం వాడుకున్నాడు. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి బాలయ్య మాస్ ని మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

సీమంతా దేవుడిలా కొలిచే ఓ నాయకుడిని చెల్లి అపార్థం చేసుకుని శత్రువును పెళ్లి చేసుకుని అన్న మీద పగ బడుతుంది. వినడానికి డిఫరెంట్ గా అనిపించే పాయింటే ఇది. అందుకే బాలకృష్ణ ఎగ్జైట్ అయిపోయి ఒప్పేసుకుని ఉంటారు. అయితే ఫ్యాక్షన్ అంటే ముందు వెనుకా ఆలోచించకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కత్తులు కటార్లు వేసుకుని వేళాపాళా లేకుండా దాడికి తెగబడతారనే ఆలోచనే రచయితలను మళ్ళీ మళ్ళీ ఒకే పొరపాటు చేయిస్తోంది. గోపిచంద్ మలినేని వయసులో ఉన్నప్పుడు చూసిన సమరసింహారెడ్డి ప్రభావంతో తన అభిమాన హీరోని ఎలా చూపించాలో అలాగే వీరసింహారెడ్డి కథ రాసుకున్నానని చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చూశాక.

ఇలాంటి కమర్షియల్ మసాలాలో సెంటిమెంట్ బ్యాలన్స్ గా ఉండాలి. ఏ మాత్రం మోతాదు మించినా ఆడియన్స్ అంచనాలకు సరితూగక లెక్క మారిపోతుంది. చెన్నకేశవరెడ్డిలో సిస్టర్ సెంటిమెంట్ చాలా అందంగా పండింది. మధ్యలో వచ్చాడు పోతాడు కావాలంటే నా భర్తను చంపెయ్ అన్నయ్యా అంటూ దేవయాని చెప్పే డైలాగు జనానికి మాములుగా కనెక్ట్ కాలేదు. కానీ వీరసింహారెడ్డికి వచ్చేసరికి అది సున్నితంగా కాకుండా ఘాటుగా డీల్ చేయడంతో కనెక్టివిటీ తగ్గిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ కి వంక పెట్టడానికి లేకపోయినా దాన్ని వాడుకున్న విధానం సంతృప్తికరంగా లేకపోయింది.

నరసింహ సినిమా రజనీకాంత్ యువకుడు నుంచి పెళ్లీడు పిల్లలయ్యే పెద్దాయనగా మారే వరకు ఒక సిరీస్ గా వెళ్తుంది. కానీ వీరసింహారెడ్డికి రివర్స్ లో వెళ్లడంతో సెకండ్ హాఫ్ కు వచ్చేటప్పటికి పెద్ద బాలయ్య గతం గురించి తెలుసుకోవడం తప్ప ఆడియన్స్ కి ఇంకే పని లేకపోయింది. దీంతో సహజంగానే మొదటి సగంలో ఎంతో ఇంపాక్ట్ చూపించిన వీరసింహారెడ్డి దాన్ని క్రమంగా తగ్గించేసుకుంటూ వెళ్ళాడు. అభిమానులకు ఈ హెచ్చుతగ్గులు ఇబ్బందిగా అనిపించకపోవచ్చు కానీ మాములు జనానికి నచ్చాలంటే రెడ్డిగారిని ఇంకోలా తీర్చిదిద్ది ఉండాల్సింది. ఫ్యాన్స్ కోసమే తీస్తే సరిపోదు మాస్ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటేనే ఇలాంవాటికి ఇంకా మంచి ఫలితాలు దక్కుతాయి.