Nandamuri balakrishna - Unstoppable With -NBKసోషల్ మీడియా ప్రభావం జనాలపైన ఎంత ప్రభావితం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్మార్ట్ ఫోన్ తో అరచేతిలో వైకుంఠం కనపడుతుండడంతో, పక్క వ్యక్తితో కన్నా ఫోన్ లో చాటింగ్ చేసుకునే రోజులివి. ఇక సెలబ్రిటీలపై వచ్చే గాసిప్ లు, ఫ్యాన్స్ చేసుకునే రచ్చలు, రాజకీయ పోరాటాలు… ఒకటేమిటి అన్నింటికీ సోషల్ మీడియా మాధ్యమాలు ఒక వేదికగా మారాయి.

ఈ సోషల్ మీడియా ఖాతాలలో సగం పైగా అకౌంట్ లు ఫేక్ ఖాతాలే ఉంటాయని గతంలో వెల్లడైన పలు సర్వేలు స్పష్టం చేసాయి. ఈ ఫేక్ అకౌంట్ లు పెట్టుకుని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వారికి ‘ఆహా’ అన్ స్టాపబుల్ వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ చిన్నపాటి వార్నింగ్ నే ఇచ్చారు. అలాగే వారిని ఎలా పరిగణించాలో కూడా తెలిపారు.

పేరు లేని, లొకేషన్ తెలియని అడ్రస్ లతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. రవితేజకు, బాలకృష్ణకు పడదు, చిరంజీవి – బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడుకోరు, నా హీరో తోపు – నీ హీరో సోపు, ఏంటి ఇవన్నీ!? లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయ్యింది, దొరికితే దవడ పగిలిపోద్ది కాస్త భీకరంగా స్పందించినా, ఆ వెంటనే సంయమనంతో శాంతి వ్యాఖ్యలు కూడా చేసారు.

మనం చేయాల్సింది ఒక్కటే… ఊరు, పేరు చెప్పుకోలేని, ధైర్యం లేని ఈ వెధవలను క్షమిద్దాం, మన మీద వచ్చిన విమర్శలను ప్రేమిద్దాం అంటూ సోషల్ మీడియా ఫేక్ రాయుళ్ల గురించి బాలయ్య ప్రస్తావించారు. నిజమే ఒకప్పుడు సినీ అభిమానులు విపరీతంగా సోషల్ మీడియాలలో రచ్చ చేసుకునేవారు, ఇప్పటికీ కూడా జరుగుతోంది గానీ, గతంతో పోలిస్తే ఈ ఒరవడి సినీ హీరోలపై కాస్త తగ్గిందనే చెప్పాలి.

సినీ హీరోలకు మించి రాజకీయ వివాదాలకు నిలయంగా సోషల్ మీడియా మారిపోతోంది. సినీ అంశాలు కేవలం పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అయిన టైంలోనో లేక టీజర్, ట్రైలర్ రిలీజ్ అప్పుడే జరుగుతున్నాయి. కానీ పొలిటికల్ ట్రోలింగ్ అలా కాదు. నిత్యం ప్రభుత్వ నిర్ణయాలను ఏకరువు పెడుతూ ప్రతిపక్షం వర్గాలు ట్రోల్స్ చేస్తుంటే, గత అంశాలను స్పృశిస్తూ అధికార పక్ష వర్గాలు చెప్తుంటాయి.

సినిమా అయినా, రాజకీయం అయినా హద్దులు దాటనంత వరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. హద్దులు దాటితే మాత్రం దాని ”మ్యూజిక్”ను చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ ట్వీట్స్ కు వచ్చేపాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విభాగాలను పెట్టి మరీ ‘ఫేక్’ ప్రచారాలను గట్టిగా తిప్పికొడుతున్నాయి.