nandamuri Balakrishna satire on akhil movieఅగ్ర హీరోలు తమ వారసుల్ని తెరంగ్రేటం చేయించే సమయంలో ఆయా హీరోలు పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదని ఇటీవల విడుదలైన “అఖిల్” చిత్రం నిరూపించింది. గతంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఇటీవల నాగార్జున ‘సిసింద్రీ’ అఖిల్ ఎంట్రీల హాట్ టాపిక్ గా మారి, ఫస్ట్ సినిమాతో ఈ హీరోలకు అంత అవసరమా? అనిపించే విమర్శలను మూటకట్టుకున్నాయి. వీరిద్దరి తర్వాత అంతే భారీ అంచనాలు నందమూరి నటసింహం వారసుడిపై ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..!

మరి బాలయ్య బాబు ఏం ఆలోచిస్తున్నారు? ఎటువంటి కధతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు? అభిమానుల మదిలో ఉన్న ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు “డిక్టేటర్” జవాబిచ్చారు. ఇటీవల ఇస్తున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మోక్షజ్ఞ తెరంగ్రేటంపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు బాలయ్య బాబు ఇచ్చిన జవాబు…

“తొలి అయిదారు సినిమాలు ఒక సాధారణ హీరోలా మాత్రమే చేయాలి. ఏదో ప్రపంచాన్ని కాపాడేసాడు లాంటి సూపర్ హీరో పాత్రలు వద్దు… ప్రేక్షకులందరూ మనబ్బాయి అనుకునే పాత్రలు చేస్తే చాలు… ఆ తర్వాత ఆటోమేటిక్ గా మాస్ ఫాలోయింగ్ వస్తుంది…” అని చెప్పడంతో ఒక విధంగా అభిమాన వర్గం షాకైనా, బాలయ్య తీసుకున్న నిర్ణయం సబబే అంటున్నారు సినీ విశ్లేషకులు.

అయితే బాలయ్య చేసిన ప్రకటన ఇటీవల విడుదలైన ‘అఖిల్’ సినిమా మరియు గతంలో ‘మగధీర’ సినిమా గురించేనని నెటిజన్లు కొత్త చర్చకు దారితీసారు. అఖిల్ ఫస్ట్ సినిమాతోనే ప్రపంచాన్ని కాపాడే సబ్జెక్ట్ తో రాగా, రామ్ చరణ్ రెండవ సినిమాతో ఒక రాజ్యాన్ని కాపాడే కధతో వచ్చిన విషయం తెలిసిందే. అందుకే తొలి అయిదారు సినిమాలంటూ ప్రత్యేకించి బాలయ్య ప్రస్తావించారని టాక్. అయితే ‘హీరోయిజం’ కన్నా ముందు నటుడిగా మోక్షజ్ఞ సెటిలవ్వాలనే దృక్పథం బాలయ్య ఆలోచనల్లో అగుపడుతోంది. బాలయ్య ఏం చెప్పినా తూచ పాటించడానికి నందమూరి అభిమాన గణం ఎలాగూ అండగా ఉంది కదా!