నందమూరి బాలకృష్ణకు సినిమా పరంగా ఈ సంవత్సరం కలిసి రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఘోరపరాజయంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయనకు హిందూపూర్ లో మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే కావడం ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా బాలయ్య తన 2014 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం విశేషం. తన తరువాతి సినిమా జయసింహ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో చెయ్యబోతున్నారు బాలయ్య. ఇటీవలే కొబ్బరికాయ కొట్టారు.
వచ్చే నెలలో షూటింగ్ మొదలు కాబోతుంది. జయసింహ అనే సినిమా లో పెద్దగా విషయం లేకపోయినా సంక్రాంతి సెలవుల వల్ల ఆడింది. దీనితో అటువంటి దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇచ్చారు బాలయ్య. హీరో సంగతి తెలిసిందే కదా అని సర్దుకుపోయారు ఫ్యాన్స్. సరిగ్గా ఈ సమయంలోనే ఒక ఫోటో వారిని కలవరపెట్టింది. బాలయ్య సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తో ఉన్న ఫోటో అది. సింగీతం గతంలో బాలయ్యకు ఆదిత్య 369 వంటి అపూరూపమైన సినిమా ఇచ్చారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆ సినిమా సీక్వెల్ అంటూ హడావిడి చేశాడు బాలయ్య. కాకపోతే అది ముందుకు జరగలేదు. ఇప్పుడు ఆ సినిమా గానీ పట్టాలు ఎక్కిస్తున్నారా అని అభిమానులు కంగారు పడ్డారు. సింగీతం అంటే వారికి గౌరవం ఉన్నా ఇప్పుడు సినిమా తీసి హిట్ చేసే వయసు కాదు ఆయనది అని వారి నమ్మకం. ఇకపోతే బాలయ్య కేఎస్ రవికుమార్ తో స్టోరీ సిట్టింగ్స్ కోసం బాలయ్య చెన్నై వెళ్ళారంట. అక్కడికి దగ్గరే సింగీతం ఇల్లు ఉండటంతో వెళ్లి పలకరించారట.