Nandamuri Balakrishna Pawan kalyan Unstoppable Season 2 నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ టాక్ షో షూటింగ్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌, అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్‌లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. దీంతో బాలయ్య, మెగా అభిమానులు, టిడిపి, జనసేన కార్యకర్తలు సంతోషంతో పొంగిపోతుంటే, వైసీపీ నేతలు అప్పుడే ఏడుపులు మొదలుపెట్టేశారు.

మంత్రి అంబటి రాంబాబు ఏనాడూ తన జలవనరుల శాఖ గురించి సాధికారికంగా మాట్లాడిన సందర్భాలు లేవు కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను వారి పార్టీలను మాత్రం రకరకాలుగా ఎద్దేవా చేస్తూ తన పాండిత్యం నిరూపించుకొంటారు. కనుక ముందుగా ఆయనే స్పందిస్తూ, “అన్నయ్య షోకి డుమ్మా, బాలయ్య షోకి జమ్మ, రక్త సంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా?” అంటూ ట్వీట్ చేశారు.

సరే! చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ దూరంగా ఉండిపోయారంటూ భాధపడుతున్న అంబటి రాంబాబు, ఒకవేళ చిరంజీవి మీడియా ముందుకు వచ్చి “నేను నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి మద్దతు ఇస్తున్నాను.. వచ్చే ఎన్నికలలో మెగాభిమానులు, ప్రజలు జనసేనకే ఓట్లు వేసి గెలిపించండి. వైసీపీని ఓడించండి,” అని పిలుపునిస్తే భరించగలరా?లేదా పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవితో భేటీ అయ్యి రాజకీయాలు చర్చిస్తే అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు భరించగలరా?అంటే భరించలేరు. కనుక మెగా బ్రదర్స్ దూరంగా ఉండటమే వైసీపీకి మంచిదని తెలిసి ఉన్నా పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య షోకి వెళ్ళలేదు కానీ బాలయ్య (చంద్రబాబు నాయుడు) షోకి వెళుతున్నాడని తెగ బాధపడిపోయారు.

ఇక మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, “బాలయ్య నిర్వహిస్తున్న ఈ షోకి పవన్‌ కళ్యాణ్‌ని పిలవడం వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. కనుక ఈ షోలో బాలయ్య ఏం ప్రశ్నలు అడగాలో దానికి పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానాలు చెప్పాలో రెండు స్క్రిప్టులు చంద్రబాబు నాయుడు ముందే తయారుచేసి వారికి పంపించే ఉంటారు. కనుక ఆ షోలో ఇద్దరూ కలిసి ఏం చర్చించబోతున్నారో ఊహించుకోవచ్చు,” అని అన్నారు.

ఇంకా ఇటువంటి సబ్జెక్ట్ మీద ఎన్ని గంటలైన అనర్గళంగా మాట్లాడగల మంత్రి రోజా వంటి వారు నేడో రేపో మీడియా ముందుకు వచ్చి తమ పాండిత్యం ప్రదర్శించకమానరు. ఇంకా ఈ ఎపిసోడ్‌ షూటింగ్ మొదలవక మునుపే వైసీపీ నేతలు ఇంతగా అసహనం ప్రదర్శిస్తున్నారు ఇక ప్రమో రిలీజ్‌కి అయితే ఎటువంటి రివ్యూలు ఇస్తారో?ఏది ఏమైనప్పటికీ ఈ షో ప్రసారం అయిన కొన్ని రోజుల వరకు వైసీపీ ఏడుపులు అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతూనే ఉంటాయి.