Nandamuri Balakrishna in Van Dyke Beard Style for NBK105నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తరువాతి చిత్రం షూటింగ్ కోసం బ్యాంగ్ కాక్ లో ఉన్నారు. నిన్న ఒక అభిమానితో సెల్ఫీ దిగారు ఆయన… అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అది ప్రొఫెషనల్ ఫోటో కాకపోవడంతో మిశ్రమ స్పందన వచ్చింది. దీనితో సినిమాలోని బాలయ్య లుక్ ని అధికారికంగా విడుదల చెయ్యాల్సి వచ్చింది. ఇందులో బాలయ్య సూట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఈ కొత్త లుక్ కు ఇప్పుడు మంచి స్పందన వస్తుంది.

ఈ ఏడాది బాలయ్య ‘యన్‌.టి.ఆర్: కథానాయకుడు‌’, ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. దీనితో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో బాలయ్యతో జైసింహా చేసిన కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఈరోజు ఉదయం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఎక్కువ సినిమాలు రేసులో ఉండటంతో క్రిస్మస్ కే విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం.