'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న “అఖండ” సినిమాకు కులం ఆపాదించే పనిలో ఓ వర్గం తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. ‘అఖండ’కు వస్తోన్న కలెక్షన్స్ వెనుక బాలకృష్ణ సామజిక వర్గం బలంగా పనిచేస్తోందనేది ఆ మందిగామధుల భావన.

ఓవర్సీస్ లో అయితే ఏకంగా ఆ సామజిక వర్గం షోలను కొనేసి టిక్కెట్లు పంచి పెట్టేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రేక్షకులు గనుక ఈ మాటలు ఫక్కున నవ్వకుండా ఉండలేరు! అంత హాస్యాస్పదంగా ఉంది వారి వాదన!

యుఎస్ లో ఒక్కో టికెట్ ధర దాదాపుగా $12 – $15 డాలర్ల మధ్యన ఉంటుంది. అలాంటిది ఒక షోనే బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది? అన్న ఒక్క ఆలోచన వచ్చినా, ఈ కుల వాదనకు తెరలేపి ఉండేవారు కాదేమో!

మరొక కామెడీ ఏమిటంటే… యుఎస్ లో ఒక్క డాలర్ ఖర్చు చేయాలన్నా బోలెడు లెక్కలు వేస్తారన్న పంచ్ లు చాలా సినిమాలలో వినిపించాయి. అలాంటిది కొన్ని వందల డాలర్లు వెచ్చించి షోలను కొనేసి ఫ్రీగా టికెట్లు పంచి పెట్టేస్తారా? అవి ఏమైనా చాక్లేట్లా? బిస్కెట్లా?

ఇందులో ఇంకో వాదన ఏమిటంటే… ‘అఖండ’ కులస్థులంతా కలిసి కార్లు, బైక్ లతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి, సినిమా సక్సెస్ నంతా వారి భుజస్కంధాల పైన వేసుకున్నారట! హాస్యం కాదండి… నిజంగానే ఇలాంటి కుల విమర్శలు చేయడంలో ఓ వర్గం  కలం పని చేస్తోంది.

కార్ ర్యాలీలు గానీ, బైక్ ర్యాలీలు గానీ గత దశాబ్డం పైగా ప్రతి అగ్ర హీరో సినిమాకు జరుగుతూ ఉన్నదే. ఇటీవల అయితే ఓ సాధారణ క్రేజ్ ఉన్న సినిమాలకు కూడా ఇలాంటి రొటీన్ ర్యాలీలు చాలా సహజంగా మారిపోయాయి. దీనికి కూడా కులాన్ని ఆపాదించడం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి.

2021లో ‘అఖండ’ విజయం సాధిస్తే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా? అప్పుడు అధికారంలోకి రావడం కోసం ఈ కులమంతా ఇప్పుడు ‘అఖండ’ను హిట్ చేస్తున్నారట. ఇదే నిజమైతే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేసి ఉండాలి. బోడి గుండుకు మోకాలుకు లింక్ పెట్టడం అంటే ఇదేనేమో!

జర్నలిజం అనేది కొత్త పుంతలు తొక్కితే, పాఠకులకు గానీ, వీక్షకులకు గానీ ఆహ్లాదకరంగా ఉంటుంది, అదే ఈ ‘కుల’ పుంతలు తొక్కితే, రోత కలగడం సహజం! అది ఏ వర్గ కులస్తులైనా! ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేయాలని రేపుతున్న ఈ కుల వివాదాలు తదుపరి తరాలకు మిక్కిలి చేటు చేస్తుందన్న విషయం అందరూ గమనించుకోవాలి.

అయినా ఏదైనా ఒక కులం వారు సినిమాను నెత్తిన పెట్టుకుంటే ఆడేస్తుందా? కలెక్షన్స్ వచ్చేస్తాయా? ఏ హీరో అభిమానులకైనా కులాన్ని ఆపాదించడం నైతికత కాదు, అది ఎంతటి వారైనా సరే! రాజకీయం వలన ఇప్పటికే కుల చిచ్చు పెద్ద ఎత్తున రగులుతోంది. ఇప్పుడు సినిమాలకు కూడా దానిని వర్తింపచేసి పొందే లాభం సమంజసమేనా?!