Namrata Shirodkarసినీ సెలబ్రిటీలు రాజకీయాలకు ఉన్న అనుబంధం తెలియనిది కాదు. అయితే నాణానికి మరో వైపు చూస్తే… టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లాంటి వ్యక్తులు రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటుంటారు. తనకు రాజకీయాలంటే అసలు తెలియదని, అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని చాలా సందర్భాలలో సూటిగా స్పష్టంగా, ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చెప్పారు. దీంతో ప్రిన్స్ పైన ఇలాంటి పుకార్లకు ఆస్కారం లేకుండా పోయింది.

అయితే తాజాగా ప్రిన్స్ సతీమణి నమ్రత శిరోద్కర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పబ్లిసిటీ ఎక్కడి వరకు వెళ్లిందంటే… నమ్రత పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది… ఏ పార్టీ నుండి తెరపైకి వస్తారో అన్న ఒక్క విషయమే మిగిలి ఉంది… అన్నట్లుగా సోషల్ మరియు వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగా నమ్రత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? నిప్పు లేనిదే పొగ రాదుగా అన్న నానుడిని అనుసరిస్తే… అసలు నమ్రతపై ఈ పుకార్లకు ఆస్కారం ఇచ్చిన అంశాలేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నమ్రత రాజకీయాల్లోకి రావడమంటే… అది నేరుగా మహేష్ బాబు పైనే ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. మహేష్ నుండి నమ్రతను వేరు చేసి చూడడం అసాధ్యం కాబట్టి, ఇందుకు ప్రిన్స్ అంగీకారం తెలుపుతారనుకుంటే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలలో అన్ని వర్గాల వారి ఆదరణ అందుకున్న ఏకైక హీరోగా మహేష్ కు పేరుంది. అలాంటి మహేష్, తన సతీమణిని రాజకీయ రంగంలోకి దించుతారనేది కేవలం ఒక పుకారుగా పరిగణించాల్సి ఉంటుంది.

అయితే ఇందుకు ఊతమిచ్చిన అంశాలు ఏమిటంటే… మహేష్ దత్తత తీసుకున్న రెండు గ్రామాల అభివృద్ధిని నమ్రత దగ్గరుండి చూసుకుంటోంది. మహేష్ కుండే సినిమా షెడ్యూల్స్ బిజీ రీత్యా… గ్రామాల కార్యక్రమాల్లో నమ్రత విరివిగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా… ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి నాయకులతో, అలాగే తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉండడంతో… నమ్రత పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది.

ఒకప్పుడు కాంగ్రెస్ లోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ కృష్ణ సృష్టించిన సంచలనం తెలియనిది కాదు. అయితే రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైన కృష్ణ, ఆ తర్వాత వైఎస్ సమయంలో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారన్న వార్తలు వచ్చాయి గానీ, అది కేవలం ఒట్టి పుకారుగానే మిగిలిపోయింది. ఆ క్రమంలోనే మహేష్ కూడా కాంగ్రెస్ కు ప్రచారం జరిగిందే. అప్పుడే ప్రిన్స్ పెదవి విప్పి… తనకు ఎంపీ, ఎమ్మెల్యేకు ఉన్న తేడా కూడా తెలియదు… తానస్సలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టడంతో ప్రిన్స్ ఫ్యామిలీ పొలిటికల్ ప్రస్థానానికి తెరపడింది. ప్రస్తుతం నమ్రత పైన వస్తున్న వార్తలు కూడా గతంలో ప్రిన్స్ పైన వ్యక్తమైన కధనాలుగా పరిగణించాల్సి ఉంది.