Nallari Kishore Kumar Reddy comments on Peddi Reddy Rama Chandra Reddyసిఎం జగన్మోహన్ రెడ్డి నిన్ననే తమ ప్రభుత్వంలో దోచుకోవడం… పంచుకోవడం లేదని సగర్వంగా చెప్పుకొన్నారు. కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి (ఎంపీ) ఇద్దరూ కలిసి చిత్తూరు జిల్లాలో ఇసుకను దోచుకొని అక్రమంగా తమిళనాడు, కర్ణాటకలకు తరలించి అమ్ముకొంటున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్‌ రెడ్డి అన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి తమిళనాడుకి చెందిన వ్యాపారవేత్త శేఖర్ రెడ్డితో బేరం కుదుర్చుకొని చిత్తూరు నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క చిత్తూరు జిల్లా నుంచే ప్రతీరోజు చెన్నై, బెంగళూరు నగరాలకు 300 టిప్పర్ల ఇసుక వెళుతోందంటే వారి దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్దం చేసుకోవవచ్చని అన్నారు.

తండ్రీ కొడుకులు గనుల యాజమానులను కూడా బెదిరించి, భయపెట్టి కోట్లాది రూపాయలు కమీషన్లు దండుకొంటున్నారని, కమీషన్‌ ఇవ్వకపోతే వందల కోట్లు జరిమానాలు విధిస్తామని ఇద్దరూ బెదిరిస్తున్నారని అన్నారు. కమీషన్‌కు ఇవ్వకపోతే గనులలో వాటా రాయాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.

వారి వేధింపులు భరించలేక గనుల యజమానులు వారికి భారీగా కమీషన్లు ముట్టజెపుతున్నా, మళ్ళీ వైసీపీలో చేరాలని లేకుంటే జరిమానాలు తప్పవని బెదిరిస్తున్నారని నల్లారి కిశోర్ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో టిడిపికి చెందిన ఓ నాయకుడిని ఇలాగే వైసీపీలో బలవంతంగా చేర్చుకొన్నారని ఆరోపించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలపై తాను చేసిన ఈ ఆరోపణలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలనని నల్లారి కిశోర్ కుమార్‌ రెడ్డి అన్నారు. చిత్తూరులో తండ్రీ కొడుకులు అక్రమాలు, ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. యధారాజా తధాప్రజా అన్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మడికట్టుకొని కూర్చోరు కదా? అని ప్రశ్నించారు. ఈ ముగ్గురికీ రాబోయే రోజులలో శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే పడుతుందని నల్లారి కిశోర్ కుమార్‌ రెడ్డి అన్నారు.