nallari-kiran-kumar-reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా తన జీవనశైలిని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విభజన జరిగిన తర్వాత సిఎం పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టి… చివరి నిముషంలో పోటీ నుండి తప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, ‘గోల్ఫ్’ తదితర ఆటలు ఆడుతూ తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే విభజన విషయంలో అసలేం జరిగిందన్న దానికి ప్రత్యక్ష సాక్షి కిరణ్ కుమార్ రెడ్డి కావడంతో, ఆయన మాటలకు రాజకీయంగా ఎప్పుడూ ప్రాధాన్యత దక్కుతాయి.

ఇటీవల జైరాం రమేశ్ రచించిన పుస్తకంలో కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో.., సదరు అంశాలను ప్రస్తావిస్తూ ‘సమైక్యాంధ్ర’ హీరో మీడియా ముఖంగా మళ్ళీ తెరపైకి రాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. “రాష్ట్ర విభజనను అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్వరంతో వ్యతిరేకించారని, స్వయంగా సోనియా గాంధీ ముందు అధిష్టాన నిర్ణయాన్ని తప్పని చెప్పారని… పలు కీలక విషయాలను జైరాం తన పుస్తకంలో ప్రచురించారు.

దీంతో తానూ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కిరణ్ కు జైరాం రమేశ్ పుస్తకం ఒక వరంలా మారిందని, అందుకని ఆ పుస్తకంలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ… నాడు జరిగిన విషయాలను ప్రజలకు మరోసారి వివరించే ప్రయత్నం చేసి… తన చిత్తశుద్దిని చాటుకునే ప్రయత్నం చేస్తారని ఓ టాక్. అయితే గతంలో బిజెపిలోకి అడుగు పెడతారంటూ వచ్చిన వార్తలు ఇప్పటివరకు కార్యరూపం సిద్ధించుకోలేదు. దీంతో ఈ సారైనా కిరణ్ కుమార్ రెడ్డి ‘మౌనం’ వీడి ప్రజల ముందుకు వచ్చి, రాష్ట్రం పట్ల తన అభిప్రాయాన్ని చెప్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.