ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణకు తాను స్టార్ బ్యాట్సమెన్ అని చెప్పుకునేవారు. అయితే ఆయన విభజనను అడ్డుకోవడానికి చేసింది ఏమి లేదు. తరువాత జై సమైఖ్య ఆంధ్ర పార్టీ అనే పార్టీ మొదలు పెట్టి ఆయనే పోటీ చెయ్యకుండా శ్రమపడినా ఆ పార్టీకి ఎక్కడ ఒక సీట్ కూడా దక్కలేదు.

జై సమైఖ్య ఆంధ్ర పార్టీ ఎక్కడైనా కొంత పోటీ ఇచ్చింది అంటే అది పీలేరులో మాత్రమే. కిరణ్ సొంత నియోజకవర్గంలో ఆయన సోదరుడు కిశోర్‌ కుమార్‌రెడ్డి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం మూడవ స్థానంలోనే ఉండిపోయింది. ఇప్పుడు కిషోర్ తెలుగు దేశంలో జాయిన్ అవుతున్నారు.

పీలేరు నియోజకవర్గంలో ఆయనకి మంచి పట్టుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవుల్లో ఉన్నప్పుడు ఆయన తరపున నియోజకవర్గంలో కిశోర్‌ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. దీనితో కిరణ్ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన బీజేపీ లేదా మళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నారు అని పుకార్లు వచ్చాయి.

అయితే ఇది జరగలేదు. జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. జగన్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడరని ఆయన ఫాలోయర్స్ అంటున్నారు. ఇక మిగిలింది తెలుగు దేశం మాత్రమే. ఆయన సోదరుడు కూడా జాయిన్ అవ్వడంతో ఆయనకు పెద్దగా ప్రత్యామ్నాయం లేదనే చెప్పుకోవాలి. మరి ఆయన ఏంచేస్తారో చూడాలి!