Nakshatram Postersకధలో ‘కంటెంట్’ సరిగా లేనపుడు హీరోయిన్ల అందాలతో సినిమా ప్రమోషన్లు చేయడం ‘అవుట్ డేటెడ్ ప్రమోషన్.’ అవును… గోడలపై పోస్టర్లు అంటించే పబ్లిసిటీ సమయంలో… సినిమాలో విషయం లేదని భావిస్తే… పోస్టర్లపై ప్రత్యక్షమయ్యేది హీరోయిన్ల సౌందర్యాలే! ఈ తరహా ప్రమోషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, అయితే ఇప్పుడు గోడలపై పోస్టర్లు లేవు గానీ, డిజిటల్ యుగం రీత్యా… సోషల్ మీడియా ద్వారానే అలాంటి బి-గ్రేడ్ పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ తమ సినిమాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

మరి క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన కృష్ణవంశీ సినిమాకు కూడా అదే తరహా ‘బి-గ్రేడ్’ పబ్లిసిటీ అవసరమా? ఈ ఆలోచనలు ఎవరివో గానీ, “నక్షత్రం” సినిమాలోని కంటెంట్ కంటే కూడా, బీచ్ సాంగ్ లో అందాలు ఆరబోసిన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కేంద్రంగానే చిత్ర పబ్లిసిటీ చేస్తున్నట్లుగా కనపడుతోంది. నిర్మాణ సంస్థ విడుదల చేసిన తాజా పోస్టర్లు ఇందుకు నిదర్శనంగానే నిలుస్తున్నాయి. బీచ్ ఒడ్డున సాయిధరమ్ తేజ్ తో ప్రజ్ఞా జైస్వాల్ ఉన్న రకరకాల భంగిమల పోస్టర్లపై విడుదల తేదీని ముద్రించి విడుదల చేయడం విశేషం.

కృష్ణవంశీ అంటే బీచ్ సాంగ్ ను ప్రేక్షకులు ముందుగానే ఊహించవచ్చు గానీ, పోస్టర్ల విభాగంలో అదే బీచ్ సాంగ్ కేంద్రంగా సినిమా రిలీజ్ పబ్లిసిటీ కేంద్రీకరించడం మాత్రం “నక్షత్రం” సినిమా కంటెంట్ ను పక్కదారి పట్టిస్తుందని చెప్పవచ్చు. యూత్ ను ఆకర్షించడానికి, సినిమా ఓపెనింగ్స్ కోసం ఈ పోస్టర్లు ఉపయోగపడతాయేమో గానీ, సినిమాను నిలబెట్టడానికి మాత్రం కాదు అని చిత్ర యూనిట్ గుర్తుంచుకోవాలి. ఇలా కాకుండా ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ప్రేక్షకులకు అందిస్తే… దీని కంటే ప్రయోజనం ఎక్కువ చేకూరేదేమో..!