Nakka Anand Babu questions jagan governmentబాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని దోనేపూడిలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నేతృత్వంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. దోనేపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన తరువాత ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి ఏ అధికారంతో రూ.8.30 లక్షల కోట్లు అప్పులు చేశారో తెలీదు కానీ ఆ భారం ప్రజలపై మోపుతున్నారు.

అప్పులు తెచ్చి సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తూ మళ్ళీ వాటిలో కూడా కోతలు విధిస్తూ లబ్దిదారులను కూడా జగన్ మోసం చేస్తున్నారు. మరోపక్క విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వగైరా పెంచేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. జగన్ పాలన ఇంకా కొనసాగితే ఆంధ్రా పరిస్థితి కూడా శ్రీలంకలా మారడం ఖాయం. కనుక ఆయనను సాగనంపాల్సిన సమయం వచ్చింది. ప్రజలందరూ కూడా ఆయనను సాగనంపేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు డాక్టర్ కనగాల మధుసూధన ప్రసాద్, నిమ్మగడ్డ అనిల్, మైనేని మురళీకృష్ణ, వి.మహేష్, వి.మోహనకృష్ణ, కె.నాగశ్రీధర్, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

మండలంలోని గూడపాటివారిపాలెంలో టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టిడిపి కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్ళి జగన్ ప్రభుత్వం ఏవిదంగా ప్రజలను మోసం చేస్తోందో తెలియజేసే కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చింతల సుబ్బారావు, గుడారం కయ్య, చింతారావు, బి. సురేంద్ర, డి.ధరణికుమార్, మునాఫ్, లుక్కా శ్రీనివాస రావు, పి.శివరాం, సమ్మెట శ్రీహరి, ఎల్.రామస్వామి తదితరులు పాల్గొన్నారు.