KCR- etela rajenderతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే చేసిన కేబినెట్ విస్తరణ పై అసమ్మతి సెగలు ఎక్కువ అవుతున్నాయి. పదవి ఆశించి భంగపడ్డ నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నాయని నరసింహ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా బాహాటంగా కేసీఆర్ పై విమర్శలు చెయ్యడం చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగించడానికి ఒక కారణం ఉంది. ఫిరాయింపులను పక్కన పెడితే 2014-18 మధ్య తెలంగాణ రాష్ట్ర సమితికి బొటాబొటి మెజారిటీ ఉంది.

అప్పుడు కూడా ఎక్కడ ధిక్కార స్వరం అనేది వినిపించలేదు. 2018 ఎన్నికలలో భారీ మెజారిటీ తో కేసీఆర్ గెలిచి ఇప్పుడు సొంత నేతల నుండి వ్యతిరేకతను ఎదురు కోవడం విశేషం. అసలు అసంతృప్త నేతల ధైర్యం ఏంటి? అని పరిశీలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని కనిపిస్తుంది. బీజేపీ ఈ మధ్య తెలంగాణలో పట్టు సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. దానితో కేసీఆర్ కాకపోతే ఇంకొక పార్టీ అని ధైర్యం తెరాస అసంతృప్త నేతలలో కనిపిస్తుంది.

పైగా తెరాస రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చాకా మూడో సారి అధికారం అనేది రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక పార్టీకి మూడో సారి అధికారం వచ్చిన సందర్భాలు తక్కువ (కాంగ్రెస్ గుత్తాధిపత్యం తరువాత). దీనితో బహుశా ఈ నేతలు తమ దారి తాము చూసుకునే అభిప్రాయంలో ఉండి ఉండవచ్చు. అయితే ఈ నేతల వల్ల కేసీఆర్ కు గానీ ఆయన ప్రభుత్వానికి గానీ వచ్చిన నష్టం అయితే ఉండదు. అయితే ఇటువంటి నేతల వల్ల ప్రభుత్వం ప్రతిష్ట పల్చబడుతుంది. ప్రభుత్వం వీక్ అయ్యింది అనే అభిప్రాయం పెరిగి వచ్చే ఎన్నికలలో తెరాసకు నష్టం చెయ్యవచ్చు.