nagma in tamil nadu tourమహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశారు. గురువారం చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో జరిగిన తమిళనాడు మహిళా కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశంలో మాట్లాడుతూ… తమిళనాడు ప్రజల గోడు పట్టించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని విమర్శించారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించి రాష్ట్రంలో అడ్డ దారిలో మద్యం దుకాణాలు తెరవకుండా ఉండాలని అన్నారు.

తమిళ రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో ఆందోళన చేపడితే వారి గోడును పట్టించుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందేనని నగ్మా డిమాండ్ చేసారు.

రాష్ట్రంలో ఒక శాతం మద్దతు కూడా లేని బీజేపీ, అన్నాడీఎంకే చీలిక తెచ్చి, ఇక్కడ కాలు మోపేందుకు రాజకీయ కుట్రకు ప్రయత్నిస్తోందన్నారు. మహిళలను కించపరిచిన కేరళ మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా నగ్మా డిమాండ్ చేశారు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా నగ్మాకు తమిళులపై ఎందుకంత ప్రేమ అంటూ ప్రత్యర్ధి వర్గాలు కౌంటర్లు వేస్తున్నారు.