Nagendra babu konidela -comments on andhra pradesh capitalదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. రాష్ట్రం ఏర్పడి సుమారు ఎనిమిదేళ్ళవుతున్నా ఇంతవరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో ఎవరికీ తెలియదు. కేంద్రప్రభుత్వం, ప్రజల దృష్టిలో ఏపీకి అమరావతి రాజదాని అయితే జగన్ ప్రభుత్వం ఒకటి కాదు…మూడు రాజధానులున్నాయని… అసలు సిసలైన రాజధాని విశాఖ అని చెపుతుంటుంది. కనుక ఏపీకి రాజధాని ఏదో… ఎక్కడుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని దుస్థితి నెలకొంది.

జనసేన నాయకుడు నాగాబాబు నిన్న ఇదే మాట చెప్పారు. జనసేన, వైసీపి, టిడిపిల రాజకీయాలను పక్కనపెడితే, రాజధాని గురించి ఆయన అన్న మాటలు ప్రజల ఆవేదన, అభిప్రాయాలకు అద్దం పట్టాయని చెప్పక తప్పదు. ఏ వ్యక్తికైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా ఓ ఉనికి లేదా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది లేదా ఉండాలని కోరుకొంటారు. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆ గుర్తింపు, ఆత్మగౌరవం కోసమే పోరాడి ఉత్తరాదివారి దృష్టిలో ‘మద్రాసీలు’గా ముద్రపడిన తెలుగువారికి ‘తెలుగువారు’ అనే గుర్తింపు కల్పించారు.

అదేవిదంగా ఇప్పుడు అమరావతి లేదా విశాఖ నగరమో మా రాజధాని అని ప్రతీ ఆంద్రుడు గర్వంగా చెప్పుకోగలిగి ఉండాలి. ఆ రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలని ప్రజలు కోరుకోవడం అత్యాశ కాబోదు. అదే నాగబాబు తనదైన శైలిలో చెప్పారు. కనుక పాలకులు ఆయన మాటలను రాజకీయకోణంలో చూసే బదులు ప్రజల ఆవేదన, అభిప్రాయలుగా భావించి చూస్తే ఆ బాధ అర్ధం అవుతుంది. అయితే నేటికీ ఏపీకి రాజధాని లేదని బాధపడకపోగా, నేటికీ హైదరాబాద్‌ మన రాజధానే అని ఓ మంత్రి అనడం ఇంకా బాధాకరం. అలా చెప్పుకోవడం మనకి అవమానం కాదా?ఆలోచిస్తే బాగుంటుంది.

ఇక ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి సుమారు 8 ఏళ్ళు అవుతున్నా నేటికీ ఉన్నత విద్యా, ఉద్యోగాలు, చివరికి మెరుగైన కోసం హైదరాబాద్‌కు ఎందుకు వెళ్ళాల్సి వస్తోంది?ఇంతకాలం అయినా ఏపీలోనే ఎందుకు విద్యా, వైద్య, ఉద్యోగావకాశాలు కల్పించుకోలేకపోయాము? ఆ దిశలో గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నాలను ఎందుకు అటకెక్కించేశాము? అని పాలకులు ప్రశ్నించుకోకపోగా వారు కూడా వైద్యం కోసం హైదరాబాద్‌కి పరుగులు తీస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక ఇక ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీలో ప్రజలందరూ తట్టాబుట్టా సర్దుకొని పొరుగు రాష్ట్రాలకు వలసపోవలసి ఉంటుందని నాగబాబు చెప్పిన మాటలను తప్పు పట్టలేము. ఆయన ఆవేదనకు రాజకీయరంగు పులిమి ఎదురుదాడి చేసి చేతులు దులుపుకోవచ్చు కానీ ఏపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతుందని మరిచిపోకూడదు.