nagendra-babu-comments-pawan-kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈయన కొంచెం తేడానే..! అవును అభిమానులు సైతం ఒప్పుకునే విషయం. ఇంకా చెప్పాలంటే పవర్ స్టార్ అభిమానులు గర్వంగా చెప్పుకునే విషయంగా మారింది. దీనంతటికి కారణం… పవన్ వ్యక్తిగతంగా వ్యవహారించే విధానమే. రొటీన్ విధానాలకు అలవాటు పడిపోయిన జనాలకు కాస్త ‘తేడా’ను రుచిచూపించడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. అది వ్యక్తిగత జీవితంలో అయినా… సినీ కెరీర్ లో అయినా… రాజకీయాల పరంగా అయినా..!

ఇదే విషయాన్ని మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా ధృవీకరించారు. అవును… “మా కళ్యాణ్ బాబు తేడా మనిషి” అని స్వయంగా నాగబాబే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “అభిమానులు కోరుకుంటేనో, కోరలేదనో వాడు రాజకీయాల్లోకి వెళ్ళలేదు, అభిమానులు పిలిచారని వెళ్ళలేదు, వాడు వెళ్ళాలంటే వెళ్తాడంతే… జనసేన పార్టీ స్థాపించింది అభిమానులు పెట్టమన్నారని పెట్టలేదు. అన్నయ్య ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి సక్సెస్ కాలేదు కాబట్టి, ‘జనసేన’ పెట్టలేదు, వాడికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఏదో చేయాలన్న తపన ఉంది, మా వాడు గొప్పోడు…” అంటూ తమ్ముడి శైలి గురించి చెప్పుకొచ్చారు.

“నిజంగా వాడి దగ్గర డబ్బులు లేవు, అసలు డబ్బులు గురించి లెక్క చేయడు, ఒక రకంగా నా వలన కూడా కొంత డబ్బులు నష్టపోయాడు, ప్రస్తుతం సినిమాలు చేస్తోంది కూడా డబ్బులు సంపాదించుకోవడానికే… ఆర్ధికంగా వాడు డబ్బులు సంపాదించుకుని, జనసేనను కూడా నడపాలి. మోడీ తీసుకున్న నిర్ణయం కళ్యాణ్ బాబు లాంటి నిజాయితీ పరులకు దోహదపడుతుంది. నిజంగా సేవ చేయాలనుకునే కళ్యాణ్ బాబు లాంటి వారికి ఇదొక మంచి అవకాశం లాంటిదని” నాగబాబు అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు చెప్పిన సంగతులన్నీ బాగానే ఉన్నాయి గానీ, ఈ మాటలు వింటుంటే మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ రోజులు గుర్తుకు రావడం సహజమే. అభిమానులు పిలిచారంటూ చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అభిమానులు కోరారంటూ ‘ప్రజారాజ్యం’ స్థాపించడం తదితర సంఘటనలు తెలిసినవే. అయితే ‘ప్రజాసేవ’ చేయాలని రాజకీయాల్లోకి వచ్చే వారిని నిజంగా అభిమానులు పిలవాలా? లేక స్వచ్ఛందంగా పవన్ మాదిరి రాజకీయాల్లోకి రావాలా? మరి ఇప్పుడు నిజంగా ఎవరు తేడా? చిరంజీవా? పవన్ కళ్యాణా?

ఏమిటో… నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడితే… ప్రస్తుత సమాజంలో “వాళ్ళు కొంచెం తేడానే” అన్న ముద్ర వేయడం సర్వ సాధారణమైపోయింది. ప్చ్…!