Nagarjuna university suspends 4 students for supporting amaravatiఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చెయ్యడం ఇప్పుడు తీవ్ర చర్చనీయంశంగా మారింది. జై అమరావతి అని నినాదాలు చేసినందుకే సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికార ఉత్తరువులలో వారు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టు చెప్పడం గమనార్హం.

విద్యార్థులు ఆశీర్వాదం, నవీన్, ఏడుకొండలు, రాజును సస్పెండ్ చేశారు. ఆశిర్వాదం, నవీన్ జర్నలిజం కోర్సు చేస్తున్నారు. మిగతా ఇద్దరు ఇంగ్లీష్ డిపార్టుమెంట్ కు చెందిన వారు. వెంటనే వసతి గృహం నుంచి వెళ్లిపోవాలని, సోమవారం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే వర్సిటీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేక చర్య అని వారు ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలియజేయడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కు… విద్యాబుద్ధులు బోధించే విశ్వవిద్యాలయానికి చెందిన యాజమాన్యం ఆ హక్కుని కాలరాయడం, ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడం ప్రజాస్వామ్యానికే మచ్చ అంటూ పలువురు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు.

నలుగురు విద్యార్థులు అమరావతి ప్రాంతానికి చెందిన వారే. స్థానిక రిజర్వేషన్ కింద వారు నాగార్జున యూనివర్శిటీలో సీటు సాధించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ వారంతా తరచూ అమరావతి ప్రాంత రైతుల నిరసనల్లో పాల్గొంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. అమరావతి పరిరక్షణ సమితి సారథ్యాన్ని వహిస్తోన్న ఐక్య కార్యాచరణ కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని వారి మీద ఆరోపణ.