Nagarjuna-Raju-Gari-Gadhi-2-Workingవినూత్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ ల మీద సక్సెస్ లు చవిచూస్తున్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జునకు, ఇటీవల విడుదలైన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఆశించిన విజయాన్ని అందివ్వకపోయినా, నటుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెట్టింది. కమర్షియల్ కోణమే సక్సెస్ కు అంతిమం కాదంటూ కొనసాగుతున్న నాగ్, కెరీర్ లో తొలిసారిగా ఓ హార్రర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

“రాజు గారి గది 2” పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షూటింగ్ లో పాల్గొంటున్న నాగ్, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లొకేషన్ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు ‘కింగ్.’ తన ఇద్దరు తనయులు చైతూ, అఖిల్ లకు పోటీగా వస్తాడనిపించే విధంగా సింపుల్ లుక్ లో అదరగొట్టేసాడు నాగ్. అందమైన మరియు అంతులేని సముద్రం పక్కన షూటింగ్ ఎంతో బాగుందని చెప్తూ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో… నాగ్ చేతికి తాయత్తులు కట్టి ఉండడం గమనించవచ్చు.

ఇప్పటివరకు మన్మధుడిగా యువతరం హృదయాలను, ఓ భక్తుడిగా పెద్దల హృదయాలను గెలుచుకున్న నాగ్, తన గ్లామర్ లుక్ తో త్వరలో దెయ్యాల మనసులను కూడా కొల్లగొడతారేమో? ఏమో… ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు… ఈ సినిమా మరో ఎత్తు అంటూ సినిమా ప్రారంభం రోజునే ‘రాజు గారి గది 2’ గురించి నాగ్ ప్రస్తావించడంతో, ఒక్క అభిమానులే కాదు, నాగ్ కూడా ఈ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారని స్పష్టమైంది.