Nagarjuna Kimidi new strategy about 2024 electionsఒకప్పుడు అన్ని పార్టీలు కార్యకర్తలలో నుంచే నాయకులు తయారుచేసుకొనేవి కానీ ఇప్పుడు అంత ఓపిక ఏ పార్టీకి లేకపోవడంతో ఇతర పార్టీల నేతలను, వారి అనుచరులను పార్టీ కండువాలు కప్పి చేర్చుకొంటున్నాయి. ఇటువంటి రెడీమేడ్ రాజకీయనాయకులకు, వారి అనుచరులకు ఆ పార్టీ సిద్దాంతాలు, విధానాలపై నమ్మకం ఉండదు కనుక పదవులు, అధికారం లభించినంత కాలం పార్టీలో ఉంటారు లేనప్పుడు ఆ అవకాశం ఇస్తున్న వేరే పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. బలమైన పునాదులు లేకుండా నిర్మించుకొన్న పార్టీలు, వాటి అధికారిక సౌధాలు చిన్నచిన్న ప్రకంపనలకే పేకమేడల్లా కూలిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇక ఇతర పార్టీల నుంచి నేతలను వారి అనుచరులను దిగుమతి చేసుకోవడమే కాకుండా ఎన్నికలలో భారీగా పెట్టుబడి పెట్టి ఖర్చు చేయగలవారిని కూడా పార్టీలు తెచ్చుకొంటున్నాయి. వారికీ పార్టీ సిద్దాంతలతో పని ఉండదు కనుక అధికారంలోకి రాగానే పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వసూలు చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంగా ప్రభుత్వం మీద దాంతో పాటు అధికార పార్టీ మీద కూడా అవినీతి ముద్ర పడుతుంటుంది. పార్టీల పతనానికి ఇదీ మరో కారణమని చెప్పవచ్చు.

ఈవిదంగా ఎందుకు జరుగుతోంది అంటే, పార్టీపై నమ్మకం కలిగిన కార్యకర్తలలో నుంచి బలమైన నాయకులను తయారుచేసుకోకపోవడమే కారణమని అర్దమవుతోంది.

అయితే అదృష్టవశాత్తు నేటికీ టిడిపికి నేటికీ బలమైన క్యాడర్ (కార్యకర్తలు) ఉంది. వారికి పార్టీ పట్ల, తమ అధినేత పట్ల అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో పర్యటించినా వేలాదిగా స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలివస్తుంటారు. టిడిపి అధిష్టానం కూడా పార్టీ క్యాడర్‌కి అండగా నిలబడుతోంది.

అయితే వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు ఇది ఏమాత్రం సరిపోదని విజయనగరం జిల్లా అధ్యక్షుడు, యువ రాజకీయ నాయకుడు నాగార్జున కిమిడి చెపుతున్నారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, “ఏడు నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 7,000 మంది చొప్పున పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనగలిగే యువకులని మనం తయారుచేసుకోగలిగితే వచ్చే ఎన్నికలలో విజయనగరం జిల్లాలో టిడిపియే గెలుస్తుంది. అంటే మండలానికి 1,000 మంది గ్రామానికి కేవలం 10 మంది అన్నమాట! నేను నా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆవిదంగా ఇప్పటివరకు 1,500 మంది చురుకైన యువకులను తయారుచేసుకొన్నాను. నేను ఒక్క ఫోన్‌ చేస్తే అరగంటలో అందరూ వచ్చేస్తారు. అయితే ఇది సరిపోదు. కనుక వారి సంఖ్యను పెంచుకొనేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నాను. చీపురుపల్లి నియోజకవర్గంలో నేను చేయగలుగుతున్న పని జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలలో మీరూ చేయలేరా? రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇలా చురుకైన కార్యకర్తలను మనం తయారుచేసుకోగలిగితే ఒక్క వచ్చే ఎన్నికలలోనే మరో 30 సంవత్సరాల వరకు మనమే అధికారంలో ఉండగలము,” అని అన్నారు.

నాగార్జున కిమిడి గత ఎన్నికలలో చీపురుపల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ నిరాశ చెందకుండా తన నియోజకవర్గంలో టిడిపిని, తన క్యాడర్‌ని బలోపేతం చేసుకొంటూనే ఉన్నారు. ప్రజల మద్యే ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. టిడిపికి ఇప్పుడు కావలసింది ఇలాంటి యువనాయకులే… ఇలాంటి కొత్త ఆలోచనలే! ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే టిడిపి పునాదులు మళ్ళీ బలపడతాయి. టిడిపికి మళ్ళీ ఆనాటి పూర్వవైభవం తప్పక వస్తుంది.