Nagarjuna Fans supports YS Jagan in Nandyal By-Elections‘బిజినెస్ మెన్’ సినిమాలో సెకండాఫ్ లో ఎన్నికల గురించి మహేష్ బాబు చేత కొన్ని అద్భుతమైన డైలాగ్స్ ను చెప్పించాడు దర్శకుడు పూరీ జగన్నాధ్. ‘అన్ని సార్లు ఓటు 500కు దొరకదు… కొన్ని సార్లు 5 వేలు కూడా పెట్టాల్సి వస్తుంది… ప్రాణం పోయినా పర్లేదు… సీటు కావాల్సిన సెంటర్లు కొన్నుంటాయి… అక్కడ ఎంత ఖర్చవుతుందో కూడా ఎవరికి తెలియదు…’ అని చెప్పిన డైలాగ్స్ కు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలలో సహజంగా జరిగే విషయం కనుకనే, నాడు ఆడియన్స్ అంతగా రియాక్ట్ అయ్యారని చెప్పాలి.

ప్రస్తుతం ఏపీలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. ‘బిజినెస్ మెన్’ డైలాగ్స్ రూపంలో చెప్పాలంటే… ఓటుకు అయిదు వందలు కాదు, అయిదు వేలు పెట్టైనా ఈ సీటు దక్కించుకోవాల్సిందే… పార్టీ ప్రాణం నిలవాలంటే, నంద్యాల సీటు కావాల్సిందే… అన్న రీతిలో మారిపోయింది. ఎన్నికలు అంటే ‘ఓటుకు నోటు’ అన్నది ఇప్పుడు సర్వసాధారణం కాబట్టి, డబ్బుల పంపిణి ఓ రేంజ్ లో సాగుతుందని చెప్పాలి. ఓటుకు అయిదు వందలు పెడుతున్నారో, అయిదు వేలు పెడుతున్నారో అన్నది తేలని విషయం గానీ, ప్రస్తుతం నంద్యాలలో ఎంత ఖర్చవుతుందన్నది ఎవరికీ తెలియడం లేదు.

అయితే ఒక్క డబ్బు రూపేణా మాత్రమే కాదు, సినీ అభిమానులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ అధినేత రంగంలోకి దిగారన్న విషయం స్పష్టమవుతోంది. గత వారం నాడు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో ఘట్టమనేని ఆదిశేషగిరిరావును సమావేశపరిచి, వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసేలా బహిరంగ ప్రకటన చేయించిన జగన్ వర్గాలు, ఈ వారం నాడు ‘కింగ్’ నాగార్జున అభిమానులతో పార్టీకి మద్దతు ఉంటుందని ప్రకటించేలా చేసారు. ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ… వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఓ పక్కన రొటీన్ రాజకీయాలతో పాటు సినీ అభిమానులను కూడా కలుపుకుంటూ నంద్యాల ఉప ఎన్నికలలో విజయం సాధించాలని జగన్ ఊవ్విళ్ళూరుతున్న వైనం గమనించదగ్గ అంశాలే. నిజంగా ప్రిన్స్, అక్కినేని అభిమానులంతా శిల్పాకు ఓటేసినా, వేయకున్నా… ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉండవచ్చు. దీంతో గతంలో చిన్న చిన్న విషయాలను చాలా లైట్ గా తీసుకున్న జగన్, ఇపుడు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ… నంద్యాలను దక్కించుకుని ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారు. మరి జగన్ కల నెరవేరుతుందో లేదో గానీ, మీడియాలో ఏదొక రూపేణా హంగామా అయితే చేస్తున్నారు.