Nagarjuna Fake news Sakshi Tweetసోషల్ మీడియా వేదికగా క్రేజ్ ఉన్న హీరోలపై, హీరోయిన్లపై అనేక ప్రచారాలు జరగడం సర్వసాధారణం అయిపోయాయి. అయితే వీటికి సమాధానం చెప్పుకుంటూ పోతే… ఇక అంతు ఉండదన్న ఉద్దేశంతో… సోషల్ మీడియాలో జరిగే రచ్చపై సహజంగా ఏ సెలబ్రిటీ కూడా పెదవి విప్పరు. కానీ ‘కింగ్’ నాగార్జున మాత్రం వీటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా కనపడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా చైతూ నటిస్తున్న సినిమాలపై వస్తున్న వార్తలను నిర్మొహమాటంగా ఖండిస్తూ… సదరు ట్వీట్లకు ఎదురు ట్వీట్లు చేస్తున్నారు.

దీంతో తమ తప్పును గ్రహించి ఒరిజినల్ ట్వీట్స్ ను డిలీట్ చేయడం అవతలి వారి వంతవుతోంది. ఇటీవల ఓ సినీ ప్రముఖుడు చైతూ నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా విడుదల తేదీ గురించి ట్వీట్ చేయగా, అది తప్పుడు వార్తగా చెప్పిన నాగ్, ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే నేరుగా తనను సంప్రదించవచ్చు అంటూ సదరు వ్యక్తికి ఎదురు ట్వీట్ చేయడంతో, ముందుగా చేసిన ట్వీట్ ను తొలగించి నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇలా ఎప్పుడో గానీ స్పందించరు గనుక, నాగ్ తీరును లైట్ గా తీసుకున్నారు.

తాజాగా జగన్ మీడియా సాక్షి ఛానల్ మరో వార్తను ప్రచురించగా, ‘ఇది కూడా తప్పుడు సమాచారం’ అంటూ వెంటనే నాగార్జున ట్వీట్ చేయడంతో, నాలుక కరచుకున్న సాక్షి మీడియా, సదరు ట్వీట్ ను డిలీట్ చేసింది. దీంతో నాగ్ తన ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్పారు. ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేసే పుకార్లను ఉపేక్షించి లాభం లేదనుకున్నారో ఏమో గానీ ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో నాగ్ పై గానీ, కింగ్ కుటుంబ సభ్యులపై గానీ ట్వీట్ చేయాలంటే ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొంది.

నిజానికి ఇలాంటి ఒరవడికి నాగార్జున శ్రీకారం చుట్టడం శుభపరిణామమే. ఎందుకంటే రోజుకు కొన్ని వందల వార్తలు సోషల్ మీడియా వేదికగా పుట్టుకొస్తున్నాయి, అందులో ఏవి నిజాలో, ఏవి అసత్యాలో తెలియక గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాగ్ తీసుకున్న ఈ చొరవతో పుకార్లకు బ్రేక్ పడే అవకాశం ఉంది. సహజంగా టాప్ సెలబ్రిటీలు ఇలాంటి వార్తలపై పెద్దగా స్పందించరు. దీంతో అవి అటు తిరిగి, ఇటు తిరిగి ప్రధానంగా మారిపోతున్నాయి. కానీ ఆదిలోనే వాటికి శుభంకార్డు వేసే విధంగా నాగ్ తీసుకున్న స్టెప్ అభినందనీయం.