nagarjuna chay sam divorceఇటీవల కాలంలో నాగార్జున మాట్లాడుతోన్న మాటలన్నీ చర్చలకు, వివాదాలకు దారి తీస్తున్నాయి. ‘బంగార్రాజు’ విడుదల సమయంలో ఏపీలోని టికెట్ ధరల విషయంలో స్వార్ధపూరితంగా నాగ్ ప్రస్తావించారంటూ సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు సినీ వేదికలపై రాజకీయాలను మాట్లాడనని చెప్పి, సక్సెస్ మీట్ లో వైసీపీ వర్గాన్ని అంతా పిలిచి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా సమంత విషయంలో నాగ్ చేస్తోన్న వ్యాఖ్యలు కూడా ఇలాగే వివాదాస్పదంగా మారుతున్నాయి. చైతూ – సమంతల విడాకుల విషయంలో ముందుగా ఆ ప్రతిపాదన తీసుకువచ్చింది సమంతయేనని, దానికి తర్వాత చైతూ ఓకే చేసాడని నాగ్ చెప్పుకొచ్చారు. చైతూ – శ్యామ్ డైవర్స్ విషయంలో నాగార్జున ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తున్నారు.

నాగ్ చెప్పిన మాటలతో సహజంగానే నింద అంతా సమంత మీదకే వెళ్తోంది. అయితే సమంత ఎందుకు విడాకులు అడగాల్సి వచ్చింది? అన్న కారణం కూడా చెప్తేనే కదా… అసలు విషయం బయటకు వచ్చేది. అలా కాకుండా కేవలం తన కుటుంబ పరంగా తప్పు లేదని చెప్పుకోవడానికి ముందుగా సమంత అడిగిందని చెప్పడం, నాగార్జున స్థాయి వంటి వ్యక్తికి తగునా?

ఒకవేళ సమంతనే ముందుగా అడిగినా, చైతూ ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? అన్న విషయం కూడా చెప్తే నాగార్జునలో పెద్దరికం నిలబడి ఉండేది. అక్కినేని కుటుంబ పెద్దగా ఉన్న నాగార్జున ఈ విషయంలో తీసుకున్న చొరవ ఎంత? ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి.

వారిద్దరూ విడిపోవడానికి గల అసలు కారణాలు వదిలేసి, ఒకరిపై మరొకరు నిందలు వేసే విధంగా మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు. ఒకవేళ పబ్లిక్ కు ఈ విషయం చెప్పాలని నిజంగా భావిస్తే, ఓ ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తే, ఇలా విడతల వారీగా కాకుండా, ఒక్క రోజులో అన్ని విషయాలను పటాపంచలు చేసిన వారవుతారు కదా!