bangarraju press meet“ఏపీలో ఉన్న టికెట్ ధరలతో కలెక్షన్స్ తగ్గే మాట వాస్తవమే, కానీ నాకు ప్రాబ్లెమ్ లేదు, ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు” – ఇది బంగార్రాజు రిలీజ్ డేట్ ప్రకటన వేదిక మీద ‘కింగ్’ నాగార్జున చేసిన ప్రకటన. బహుశా ఇది విన్న తర్వాత జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టినా, ఇవన్నీ నాగ్ నోట నుండి జాలువారిన ముత్యాలే.

నాగ్ వ్యాఖ్యలు విన్న తర్వాత వెంటనే ఇటీవల నాని అన్న మాటలు గుర్తుకు రావడం సహజం. “మాలో యూనిటీ లేదు, వకీల్ సాబ్ సమయంలోనే అందరూ గట్టిగా మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదేమో” అని ఇటీవల ఇండస్ట్రీలోని ‘ఐక్యత’ గురించి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిజమే నాని చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు అని ప్రేక్షకలోకానికి మరోసారి తెలిసింది.

అక్కినేని కుటుంబ వారసుడిగా నాగార్జునకు ఇండస్ట్రీలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి నాగ్ నుండి ఎలాంటి ఇబ్బంది లేదన్న వ్యాఖ్యలు సహజంగానే టికెట్ ధరల తగ్గింపుకు మద్దతు లభించినట్లయింది. రేపటి నుండి ఇదే వ్యాఖ్యలతో ‘జగన్ అండ్ కో’ మళ్ళీ ఇండస్ట్రీ వర్గాలను టార్గెట్ చేస్తూ టికెట్ ధరలపై సినీ ప్రముఖులను కార్నర్ చేయడానికి నాగ్ అవకాశం కల్పించారు.

సినీ వేదికపై పొలిటికల్ విషయాలు మాట్లాడను, మాట్లాడకూడదు అని నాగ్ చేసిన ప్రకటన బాగానే ఉంది. కానీ టికెట్ ధరలు పొలిటికల్ అంశం కాదు, తన ఇండస్ట్రీకి సంబంధించిన విషయమని పూర్తిగా విస్మరించినట్లుగా ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తో నాగార్జునకున్న సత్సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇండస్ట్రీని అడ్డుగా పెట్టుకుంటారా?అన్నది మాత్రం జీర్ణించుకోలేని అంశం.

‘టికెట్ ధరల అంశం కమిటీ చూసుకుంటుందని, దీనిపై ఏ ఒక్కరు ప్రకటన చేయవద్దని’ ఇటీవల దిల్ రాజు బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. ఒకవేళ జగన్ కు వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేసే ఉద్దేశం లేకపోతే, కనీసం కమిటీ పేరు చెప్పి నాగ్ చేతులు దులుపుకోవచ్చు. కానీ అలా కాకుండా ఒక స్టార్ స్టేటస్ ఉన్న నాగ్ ఆ విధంగా మాట్లాడడం పట్ల సినీ అభిమానులు ఏ మాత్రం హర్షించడం లేదు.

ఇంతకీ ఈ ప్రెస్ మీట్ విశేషాలు ఏమిటంటే సంక్రాంతి సందర్భంగా తన “బంగార్రాజు” సినిమాను 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు బాగుంటే ఖచ్చితంగా 14వ తేదీకి వస్తాము, ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే మాత్రం వాయిదా అనివార్యం అవుతుందని హింట్ ఇచ్చారు.