Nagarjuna Akkineni next movie is Malayalam remake లేటు వయసులోనూ యాక్షన్ సినిమాలు, ఫైట్లంటూ ఒంటిని బాగా కష్టపెడుతున్న నాగార్జున దానికి తగ్గ ఫలితం కనీస స్థాయిలో అందుకోలేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ మరీ అన్యాయంగా టపా కట్టాయి. బంగార్రాజు హిట్టే కానీ ఒకవేళ పోటీలేని సంక్రాంతి సీజన్ కాకపోయి ఉంటే ఈ మాత్రం ఫలితం దక్కేది కాదన్న కామెంట్లో నిజం లేకపోలేదు. మరోవైపు బుల్లితెరపై బిగ్ బాస్ 6 సైతం ఏ సీజన్ కు రానంత దారుణమైన రెస్పాన్స్ తెచ్చుకోవడం గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది. దెబ్బకు తప్పెక్కడ జరుగుతోందో శల్యపరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వారసుల్లో పెద్దోడు చైతు వరస డిజాస్టర్స్ లో ఉన్నాడు.

అఖిల్ ఏజెంట్ తోకచుక్క లాగా ఎప్పుడు వస్తుందో అంతుచిక్కడం లేదు. ఇలా అయితే ఫ్యాన్స్ కి ఉత్సాహం ఎక్కడిది అందుకే నాగార్జున రీమేక్ వైపు టర్న్ తీసుకున్నారనే సందేహం కలుగుతోంది. అధికారిక ప్రకటన రాకపోయినా నాలుగేళ్ల క్రితం వచ్చిన మలయాళం హిట్ మూవీ పొరంజు మరియం జొస్ ని ప్రసన్నకుమార్ బెజవాడ డైరెక్షన్ లో చేయబోతున్నారనే వార్త గట్టిగానే తిరుగుతోంది. తన సమకాలీకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో పోలిస్తే నాగ్ చేసిన రీమేకులు తక్కువే. డెబ్యూ మూవీ విక్రమే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన జాకీ ష్రఫ్ హీరోకి పునఃరూపకం. ఆ తర్వాత శివ బ్రేక్ ఇచ్చే ముందు వరకూ వీటిని ట్రై చేసిన దాఖలాలు పెద్దగా లేవు.

తొంభై దశకం తర్వాత మళ్ళీ వీటి జోలికెళ్లారు. నిర్ణయం, వారసుడు, సిసింద్రీ మంచి ఫలితాలే ఇచ్చాయి. చంద్రలేఖ, స్నేహమంటే ఇదేరా లాంటి డిజాస్టర్ షాకులు ఉన్నాయి కానీ నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన నువ్వు వస్తావని రీమేకే. గెస్ట్ రోల్స్ చేసిన నిన్నే ప్రేమిస్తా, అధిపతిలు ఇతర బాషల కథలే. ఆపై నాగ్ రీమేక్స్ మీద అంతగా ఆసక్తి చూపించలేదు. ఊపిరి ఒకటే మినహాయింపుగా నిలుస్తుంది. మిగిలినవాటిలో స్ట్రెయిట్ సబ్జెక్టులు అప్ కమింగ్ డైరెక్టర్లకు ఇచ్చిన అవకాశాలే. ఈ గతమంతా కాసేపు పక్కపెడితే నాగ్ కిప్పుడిది వేకప్ టైం. నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ కావడం కాదు థియేటర్లలో ఆడినప్పుడే సినిమాలను హిట్ అంటారు.

ఇవన్నీ విశ్లేషించుకునే నాగార్జున కొత్తగా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. రిస్క్ లేకుండా బుర్ర బద్దలు కొట్టుకోకుండా రీజనబుల్ బడ్జెట్ లో ఎలా చేసుకోవాలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ లు నిరూపించాయి. పైన చెప్పిన పోరింజు మరియం జోస్ కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు. తక్కువ టైంలోనే పూర్తి చేయొచ్చు. డిఫరెంట్ సబ్జెక్టుతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అభిమానులు కోరుకున్న అంశాలకు లోటు లేదు. ఒరిజినల్ వెర్షన్ లో ఇది చేసింది స్టార్ హీరో కాదు. అందుకే నాగ్ కు కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతాయి. ఏదైతేనేం మొత్తానికి నాగార్జున చివరికి రిస్క్ లేని సేఫ్ గేమ్ వైపే మొగ్గు చూపేలా ఉన్నారు.