Nagarjuna Akkineni mediates between ys jagan and  Kanumuru Raghu Rama Krishnam Rajuహైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. గతంలో వైకాపా లోనే ఉన్న రఘురామ కృష్ణంరాజు జగన్ తో విభేదించి బీజేపీకి వెళ్ళి అటునుండి టీడీపీకి వెళ్లారు. టీడీపీ నుండి నరసాపురం పార్లమెంట్ టిక్కెట్ ఆశించారు. అయితే అది దక్కకపోవడంతో తిరిగి వైకాపాకు వెళ్తున్నారు. రఘురామ కృష్ణం రాజు కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు.

ఇప్పుడు ఆయనకు జగన్ నరసాపురం పార్లమెంట్ టిక్కెట్ కంఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం సినీ హీరో నాగార్జున జగన్ ను కలిశారు. నాగార్జున రాజకీయరంగేట్రం చేస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున దానిని ఖండించారు. అయితే ఇప్పుడు జగన్ కు రఘురామ కృష్ణంరాజుకు మధ్య నాగార్జున రాయభారం నడిపారని తెలుస్తుంది. రఘురామ కృష్ణంరాజు నాగార్జున ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులు.

గతంలో వైసీపీని వీడిన సమయంలో వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు రఘురామ కృష్ణంరాజు. కనీసం తన తండ్రి వైఎస్ ను ఎక్కువ పొగిడినా జగన్ ఓర్వలేరని, ఆయనతో ఎవరైనా ఐదు నిముషాలు మాట్లాడితే చాలు ఆయనకు దూరంగా ఉంటారని, ఇలా చాలా ఆరోపణలే చేశారు. ఇప్పుడు మళ్లీ తిరిగి ఆయన చెంతకే చేరారు. జగన్ కూడా గతమంతా మర్చిపోయి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని.