nagachaithanya as producerటాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, కళ్యాణ్‌ రామ్‌, మంచు విష్ణు, నారా రోహిత్‌ ఇంకా పలువురు నిర్మాతలుగా మారిన విషయం తెల్సిందే. వీరింత కూడా సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తూ హీరోగా రాణిస్తూ ఉన్నారు. ముందు ముందు ఈ జాబితా మరింత పెరుగబోతుంది. యువ హీరోలతో పాటు, కొత్త హీరోలు సైతం నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తూ సినిమాలను నిర్మించాలని ఆసక్తి చూపుతున్నారు. వారందరి దారిలోనే అక్కినేని హీరో నాగచైతన్య కూడా నిర్మాతగా మారాలని కోరుకుంటున్నాడు. ఈయన ఇప్పటికే ‘ఒక లైలా కోసం’ చిత్రం నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు.

మొదటి నుండి కూడా తనకు నిర్మాణంపై ఆసక్తి ఉందని, అందుకే తన తండ్రిని అడిగి ‘ఒక లైలా కోసం’ నిర్మాణ కార్యక్రమాన్ని తానే స్వయంగా చూసుకున్నాను అని అన్నాడు. పూర్తి స్థాయి నిర్మాతగా మారాలనేది తన ఉద్దేశ్యం అని, అందుకు ఒక కొత్త బ్యానర్‌ను ప్రారంభిస్తాను అని కూడా చైతూ చెప్పుకొచ్చాడు. తన బ్యానర్‌లో అందరు హీరోల మాదిరిగానే చైతూ కూడా చిన్న చిత్రాలను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అలాగే తాను కూడా తన బ్యానర్‌లో హీరోగా నటించే అవకాశాలున్నాయని అంటున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ ఉన్న విషయం తెల్సిందే. అయినా కూడా చైతూ కొత్తగా బ్యానర్‌ను స్థాపించాలని భావిస్తున్నాడు. అయితే నిర్మాతగా మారేది ఎప్పుడు అనేది మాత్రం చైతూ క్లారిటీ ఇవ్వలేదు.