Nagababu-Konidelaప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి, మంత్రులు, ఎమ్మెల్యేలు రేయింబవళ్ళు కష్టపడి సభకు అన్ని ఏర్పాట్లు చేసి లక్షమందికి పైగా జనసమీకరణ చేస్తే, ‘సభకు బాగా ఏర్పాట్లు చేశారని’ మెచ్చుకొని వెళ్ళిపోయారు. కానీ అంతకు ముందురోజు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా పిలిపించుకొని సుమారు అర్ధగంటసేపు సమావేశమయ్యారు. ఇది వైసీపీ నేతలకి ఎంత కడుపుమంట రగిలిస్తుందో వారి మాటలలోనే తెలుస్తోంది. వైసీపీ నేతల ప్రశ్నలు, విమర్శలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు.

“ప్రధాని నరేంద్రమోడీ పవన్‌ కళ్యాణ్‌పై గౌరవంతో ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడితే, మద్యలో వైసీపీ నేతలకు ఎందుకు అంత టెన్షన్?వారికి భయం పుట్టుకొందా లేక అభద్రతాభావామా? ప్రధాని నరేంద్రమోడీ-పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడుకొంటే మీకెందుకు? మంత్రులు పనులు మానుకొని, పాలన గాలికొదిలేసి ఎప్పుడూ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో చూసి స్పందిస్తుండటమే పనిగా పెట్టుకొన్నట్లున్నారు.

వైసీపీ నేతలకు స్క్రిప్ట్ లేకపోతే ప్రసంగించలేరేమో కానీ పవన్‌ కళ్యాణ్‌‌కు అటువంటి సమస్య లేదు. ఏ అంశం గురించైనా ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. భారతీ సిమెంట్ కంపెనీకి లబ్ది కలిగించేందుకు మిగిలిన సిమెంట్ కంపెనీలన్నిటిపై ఒత్తిడి తెచ్చి సిమెంట్ బస్తా రేట్లు పెంచేయడం వాస్తవం కాదా? జగనన్న ఇళ్ళు పేరుతో జె-గ్యాంగ్ దోచుకొన్న మొత్తం రూ.15,191 కోట్లు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జె-గ్యాంగ్ అవినీతిని మొట్ట మొదట వెలికితీసి అందరిపై చర్యలు తీసుకొంటాము,” అని నాగబాబు హెచ్చరించారు.

నిన్న పవన్‌ కళ్యాణ్‌, నేడు నాగబాబు ఇద్దరూ కూడా ఏపీలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ మాట్లాడటం గమనార్హం. అంటే జనసేన బిజెపితో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకొందా లేక బిజెపి-జనసేన కూటమి ఎన్నికలలో గెలిస్తే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.