మెగా బ్రదర్ నాగబాబు 2019 ఎన్నికల ముందు సడన్ గా జనసేన కండువా కప్పుకుని, ఆ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన మూడవ స్థానంలో నిలిచి ఘోరపరాజయం పొందారు. నాగబాబు పోటీ చెయ్యడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి బెనిఫిట్ అయ్యింది.

ఎన్నికల తరువాత నాగబాబు రాజకీయాలలో పెద్దగా కనిపించలేదు. కేవలం ఒకటి రెండు జనసేన మీటింగులలోనే ఆయన కనిపించారు. అయితే ట్విట్టర్ లో మాత్రం అనేక రాజకీయ కామెంట్లు చేస్తూ ఉంటారు. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

“ప్రత్యక్ష ఎన్నికలపై నాకు ఎప్పుడు ఆసక్తి లేదు. ఎమ్మెల్యేగానో, ఎంపీ గానో అయిపోవాలని కోరిక లేదు. 2019లో పోటీ చెయ్యాలని కూడా నేను అనుకోలేదు. చివరి నిముషంలో కళ్యాణ్ బాబు పోటీ చేస్తే బావుంటుంది… పార్టీకి అవసరమని అడిగితే నేను పోటీ చేశా. ఇక పోటీ చేసే ఉద్దేశం లేదు,” అని ఆయన చెప్పుకొచ్చారు.

“నేను రాజకీయాలలో ఉంటా… పోటీ చెయ్యకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా. వివిధ అంశాల మీద నా అభిప్రాయాలు చెబుతూ ఉంటా,” అన్నారు ఆయన. అంతా బానే ఉంది గానీ… నాగబాబు చెప్పే రాజకీయ అభిప్రాయాలతో జనసేన పార్టీ కూడా ఇబ్బంది పడటం గమనార్హం.