Phalana Abbayi Phalana Ammayiదర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మీద మంచి ఇమేజ్ ఉంది. తీసింది రెండు సినిమాలే. కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ఆడియన్స్ ని మెప్పించగలిగాడు. అవేవీ కమర్షియల్ గా రికార్డులు సృష్టించకపోయినా ఖర్చు పెట్టిన నిర్మాతలకు టికెట్లు కొన్న ప్రేక్షకులకు సంతృప్తిని మిగిల్చాయి. అయినా సరే హడావిడిగా ఏడాదికొకటి డైరెక్ట్ చేయాలని తాపత్రయపడకుండా ఎంత టైం పడుతున్నా సరే క్వాలిటీనే ముఖ్యమనుకుంటూ మెల్లగా నడుస్తూ వచ్చాడు. తన నడకలాగే మూవీ ఉండాలనే తపనే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.

ఇప్పటి యువత వేగం కోరుకుంటోంది. ఎంత యూత్ ఫుల్ లవ్ స్టోరీ అయినా సరే తగినంత ఎంటర్ టైన్మెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తోంది. వాళ్లలో అత్యధిక శాతం సున్నితమైన భావోద్వేగాలు అవసరం లేదు. సహజీవనం పేరుతో డేటింగ్ కల్చర్ పెరిగిపోతున్న ట్రెండ్ లో స్వచ్ఛమైన ప్రేమ స్నేహం అంటూ పాఠాలు చెబితే వినే మూడ్ లో లేరు. ఈ అబ్బాయి అమ్మాయిలో ఫ్రెండ్ షిప్ ఉంది. అపార్థాలు ఉన్నాయి. కాలేజీ వాతావరణం, విడిపోవడాలు మళ్ళీ కలుసుకోవడాలు ఇలా కొలతల ప్రకారమే రాసుకున్నాడు అవసరాల.

కానీ ఎమోషన్ అంటే సాగదీసిన సంభాషణలు, సుదీర్ఘంగా నడిచే సన్నివేశాలు కాదు. థియేటర్ కు వచ్చే ఆడియన్స్ పక్కింటి వాళ్ళతో స్నేహితురాళ్లతో ఎలా మాట్లాడతారో దాన్ని తెరమీద చూసేందుకు ఇష్టపడరు. డ్రామా కావాలి. ఇది లేకుండా ఎంత సహజత్వం జొప్పించినా అది ఎక్కదు సరికదా బోర్ కొట్టించే ప్రమాదం ఉంది. శ్రీనివాస్ ముందు నుంచే ఇది సంభాషణల ప్రయాణం మీద సాగే ప్రేమకథని చెబుతూ వచ్చాడు. దానికి సిద్ధపడి వెళ్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ప్రిపేర్ అవ్వడానికి ఇదేమి పరీక్ష కాదుగా.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి తడబడ్డారు. ఇలాంటి అనుభవాలు తమ వ్యక్తిగత జీవితంలో ఉన్నవాళ్ళు కనెక్ట్ అవ్వొచ్చు. కానీ సగటు జనాలందరికీ అవి ఉండవుగా. కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా ఉండే ఇలాంటి చిత్రాలు ఆడాలంటే వినోదం ఉండాల్సిందే. అలా అని పగలబడి నవ్వించే జోకులు అక్కర్లేదు. సున్నితమైన హాస్యం ఉన్నా పాస్ అయిపోవచ్చు. బలగంలో అన్ని కన్నీళ్లు ఉన్నా ఎందుకు ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులను ఏ పాయింట్ మీద టార్గెట్ చేయాలో వేణు సరిగ్గా పసిగట్టి సక్సెస్ అందుకున్నాడు. కానీ అవసరాల శ్రీనివాస్ ఇప్పటి ఆడియన్స్ అవసరమేంటో సరిగా గుర్తించలేదు.