Naga Shaurya ritu varma varudu kaavalenu movie అదేంటి ? రివ్యూ కదా … మరి ఏంటిది ? అనుకుంటున్నారా ? అవునండీ ఇది నిజంగా రివ్యూ కాదు కేవలం సినిమా చూసిన ఓ సగటు ప్రేక్షకుడిగా మా మదిలో మెదిలిన ప్రశ్నలు మాత్రమే.

నాగ శౌర్య , రీతు వర్మ కాంబోలో వచ్చిన ‘వరుడు కావలెను’ సినిమా గురించి కొన్ని ప్రశ్నలు.

ఏ సినిమాకయినా ప్రాణం కథే. దాని చుట్టూ ఎలాంటి కథనం అల్లామా ?అనేది కూడా చాలా ముఖ్యం. ఒక అబ్బాయి వెనుక పడుతూ తనతో డీప్ లవ్ లో పడిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయి తనని ఎంత ప్రేమించిందో తెలుసుకొని ప్యారీస్ నుండి సరాసరి ఇండియా కొచ్చే అబ్బాయి. వచ్చాక ఆ అమ్మాయి వెనుక పడటం ఆమె అతగాడిని అస్సలు పట్టించుకోపోవడం. మధ్యలో పెళ్లి ఈడు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేసేందుకు ఆరాట పడే  తల్లి. ఫైనల్ గా హీరో -హీరోయిన్ ఎలా ఒక్కటయ్యారు ? ఇదే ‘వరుడు కావలెను’ కథ. ఇది వింటే చాలా తెలుగు సినిమాల్లో చూసేసిన కథే కదా ఇందులో కొత్తదనం ఏముంది ? అనిపించొచ్చు. మీరు అనుకుంటున్నది నిజమే సినిమాకు అదే మెయిన్ వీక్ పాయింట్ మరి. పోనీ కథనం అయినా కొత్తగా ఆసక్తిగా సాగిందా ? అంటే అదీ లేదు. అవే నాలుగు లవ్ సన్నివేశాలు , అవే పాత్రలు, అదే ఫార్మేట్. మధ్యలో ఏంట్రా ఇది అనిపించే ఓ ఫ్లాష్ బ్యాక్. పోనీ కడుపుబ్బా నవ్వించే హిలేరియస్  ఎంటర్టైన్ మెంట్ ఉందా ? అంటే…. ఉంది కానీ అది కూడా ఓ మోతాదులో మాత్రమే అందింది అర్థవంతంగా.

ఇప్పుడు కొన్ని ప్రశ్నలు …

అసలు ఎప్పుడో కాలేజీ డేస్ లో తనని ఎంతో ఇష్టపడిన అమ్మాయి గురించి ఎవరూ ఫ్రెండ్ చెప్తే ఉన్నపళంగా హీరో హీరోయిన్ కోసం వచ్చేసే ఈ చింతకాయ పచ్చడి లైన్ ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నారు ?

పోనీ లవ్ ట్రాక్ కి బలం చేకూర్చే ఫ్లాష్ బ్యాక్ బాగుందా ? లేదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పసే లేదుగా మరి దీని మీద స్క్రిప్ట్ టేబుల్ మీద చర్చించు కాలేదా ?

మురళి శర్మ మంచి నటుడు సినిమా అంతా ఉంటాడు. కానీ పట్టుమని నాలుగు డైలాగ్స్ ఉండవు. కేవలం అతన్ని ఒకే ఒక్క బలమైన సీన్ కోసం తీసుకున్నారా ? ఇలా ఎమోషనల్ కనెక్ట్ బిల్డ్ అవుద్దా?

ఏదో ఒక సీన్ మధ్యలో సడెన్ గా రోహిణీ పాత్ర కనిపిస్తుంది. ఆమె ఇప్పుడే ఎంటర్ అయింది ఇక హీరో -మదర్ మధ్య సీన్స్ కూడా ఉంటాయా ? అంటే ఆమె ఆ ఫోన్ మాట్లాడే సీన్ తర్వాత మళ్ళీ కనిపించదు. ఒకవేళ ఎడిటింగ్ లో ఆ పాత్ర తాలూకు సన్నివేశాలు తీసేశారా ?

ఫస్ట్ హాఫ్ లో సెల్ఫీ సరళ కామెడీ అవసరమా ? ఎందుకా సన్నివేశాలు ? వెన్నెల కిషోర్ కి పెన్సిల్ ఇచ్చి రెండు మూడు పంచ్ డైలాగ్స్ ఇస్తే కామెడీ వర్కౌట్ అయిపోద్దిలే అనుకున్నారా ?

నాగ శౌర్య ఒకే కానీ ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్కి జస్ట్ కళ్ళతో నటించే హీరోయిన్ ఉంటే సరిపోతుందా ? ఓ స్టార్ హీరోయిన్ తో చేయిస్తే బాగుండేది కదా . పైగా డాన్స్ లో కూడా రీతు తేలిపోయింది. దిగు దిగు నాగ సాంగ్ లో స్కూల్లో పిల్లలు డాన్స్ చేస్తూ వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా ఆ వచ్చి రాని రీతు డాన్స్ కోసం ఆ సాంగ్ అవసరమా ?

ఇక ఏదో అలా సాగిపోతున్న సన్నివేశాల మధ్యలో హర్ష వర్ధం క్యారెక్టర్ తో ఒక ఫైట్ ఇరికించారు. ఆ క్యారెక్టర్ ని  కమర్షియల్ ఎలిమెంట్ అదేలేండి ఫైట్ కోసం పెట్టినట్టుంది తప్ప ఏం వర్కౌట్ అవ్వలేదు. పైగా అత్తారింటికి దారేది లో కోటా క్యారెక్టర్ టైప్ లో అనిపించింది. సో ఆ ఫైట్ పెట్టాలా ?

ఇలా సినిమాలో చాలానే ప్రశ్నలు ఉన్నాయి. అలాగని ఇందులో ప్లస్ పాయింట్ లేవని చెప్పలేం. కచ్చితంగా ఉన్నాయి. రెండు మూడు ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. రెండు పాటలు పర్వాలేదు. సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి ల్యాగ్ కామెడీ కొంత రిలీఫ్ ఇచ్చింది. ఆ ట్రాక్ ఇంకా పెడితే బాగుండేది. కానీ ల్యాగ్ అనుకున్నారో ఏమి కానీ ఉన్నపళంగా జనాలు నవ్వడం మొదలు పెట్టగానే దాన్ని కట్ చేసి మరో సీన్ తగిలించారు. శౌర్య డీసెంట్ రోల్ లో కూల్ గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేశాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కొన్ని సంభాషణలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథకి మించి ఖర్చు పెట్టారు. మరి పై ప్రశ్నలకు మేకర్స్ సమాధానం ఏమిటో ?