Naga Shaurya NS20 10 pack bodyఇంతకుముందు సుమంత్ నటించిన సుబ్రమణ్యపురం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ జగర్లాపుడితో యంగ్ హీరో నాగ శౌర్య తన తదుపరి చిత్రం కోసం జతకట్టారు. లాక్‌డౌన్‌కు ముందు రెండు నెలల పని మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ లాక్డౌన్ బ్రేక్ ను నటుడు ఈ చిత్రం కోసం కండలు తిరిగిన శరీరాన్ని తయారు చెయ్యడానికి ఉపయోగిస్తున్నాడు.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు, ఇందులో నటుడిని బాగా కండలు తిరిగిన శరీరంతో చూపించారు. తాను ఇప్పటికే ఎనిమిది ప్యాక్ బాడీని సాధించగలిగానని, అయితే పది ప్యాక్ బాడీని పొందడమే తన లక్ష్యమని ఒక ఇంటర్వ్యూలో నటుడు వెల్లడించాడు. అదే గనుక సాధ్యమైతే టాలీవుడ్‌లో దాన్ని సాధించిన మొదటి హీరో అవుతాడు.

అతను దానిని సాధించడానికి ఒక్క చీట్ డే కూడా లేకుండా కష్టపడుతున్నాడని వెల్లడించాడు. ఈ చిత్రంలో నటుడు విల్లుకారుడిగా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాకు పార్ధు అనే పేరు అనుకుంటున్నారట. ఈ సినిమా ఈ నటుడి కెరీర్‌లో ఇరవయ్యవ చిత్రం ఇది. శరత్ మరార్ యొక్క నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, నారాయణదాస్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు యొక్క శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

తన కెరీర్ లో ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలు చేసిన నాగ శౌర్య ఈ మధ్య మాస్ వైపుకు మళ్లాడు. మొన్న ఆ మధ్య అశ్వథామ అనే చిత్రంతో చెయ్యి కాల్చుకున్నాడు. అయితే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టు మళ్ళీ అటువంటి సినిమాతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. దానికోసం చాలా కష్టపడుతున్నాడు కూడా.