naga chaitanya samantha marriageఈ శుక్రవారం నాడు ఒకటి కానున్న నాగచైతన్య, సమంతల వివాహ వేడుకకు హైదరాబాద్ నుంచి అక్కినేని మరియు దగ్గుబాటి కుటుంబ సభ్యులు రెండు ప్రత్యేక విమానాల్లో గోవాకు బయలుదేరనున్నారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ నుంచి గోవాకు బయలుదేరనున్న ఈ విమానాల్లో నాగార్జున, వెంకటేష్ బంధుగణమంతా గోవాకు చేరనుంది. ఇక గోవాలోని ప్రసిద్థ ‘డబ్ల్యూ’ అనే స్టార్ హోటల్ లో వీరందరికీ బస ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గోవాకు చేరిన చైతూ, నాగ్ ముఖ్య బంధువులు, నాగార్జున తదితరులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

పెళ్లి అంటే ఏ అమ్మాయికైనా చెప్పలేనంతగా ఉద్వేగం ఉంటుందని, తాను కూడా అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నానని సమంత చెబుతోంది. ఇక పెళ్లయిన తరువాత కూడా తన జీవితంలో పెద్ద మార్పులు వస్తాయనేమీ భావించడం లేదని చెప్పిన శామ్, తన స్నేహితుడే భర్త కానుండటంతో ముందుముందూ ఆనందంగానే జీవితం సాగుతుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఆరు, ఏడు తేదీలలో జరగనున్న హిందూ, క్రైస్తవ వివాహాలు పూర్తయిన తర్వాత 15వ తేదీన హైదరాబాద్ లో ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తూ గ్రాండ్ గా రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు.