dhruva-premamతెలుగు నాట రీమేక్స్ కొత్తేం కాదు. ఒకప్పుడు రీమేక్ సినిమాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా విక్టరీ వెంకటేష్ నిలువగా, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రీమేక్ రాజా’గా నిలిచారు. అయితే ఒకరిద్దరూ మినహా ప్రతి హీరో ఏదొక సమయంలో రీమేక్ కోసం బాట పట్టగా, తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా “ప్రేమమ్” రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒరిజినల్ సినిమాతో పోలిస్తే… అంతటి ప్రశంసలను అందుకోలేకపోయినా… ప్రేక్షకులను మెప్పించడంలో ‘ప్రేమమ్’ సక్సెస్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రీమేక్ తో సక్సెస్ రుచి చూసిన జాబితాలో చైతూ కూడా చేరాడు. అయితే మరో మూడు నెలల్లో మరికొన్ని రీమేక్ లు తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాయి.

ముఖ్యంగా మెగా హీరోలు రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాతో, చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో ఆడియన్స్ ను పలకరించనున్నారు. సక్సెస్ అయిన రీమేక్ ను తీయడం ఎంత తేలికో, దాని నుండి విజయం అందుకోవడం కూడా అంత కష్టం. చైతూ దానిని విజయవంతంగా పూర్తి చేయడంతో, ప్రస్తుతం ఆ ఒత్తిడి మెగా హీరోలైన చెర్రీ, చిరుల మీదకు మళ్ళింది. చిరు కెరీర్ లో రీమేక్స్ కొత్త కాకపోయినా… పునరాగమనంలో మొదటి సినిమానే రీమేక్ కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక చెర్రీ పాత అమితాబ్ చిత్రాన్ని రీమేక్ చేసి దెబ్బతిన్న విషయం తెలిసిందే.