Naga-Chaitanya-Custody-Talkమార్కెట్ తో సంబంధం లేకుండా ఏ హీరోకైనా ఎత్తుపల్లాలు సహజం. కాకపోతే స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఫ్లాప్ రావడం ఆలస్యం ఏదో జరగరానిది జరిగిపోయిందన్నంత రేంజ్ లో అభిమానులు టెన్షన్ పడతారు. నాగచైతన్యకు వరసగా మరో డిజాస్టర్ పడింది. అందరూ ఒప్పుకునేదే. కస్టడీకి మొదటి రోజు వచ్చిన షేర్లు, తమిళనాడు రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందటం సహజం. కిందపడ్డవాళ్లందరూ తిరిగి లేవరని ఎక్కడా లేదే. మహామహులకే ఇలాంటి ఫేజ్ తప్పలేదు.

చైతు ఎప్పుడూ మూసకు కట్టుబడలేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలాంటి కథలకు సూటవుతుందనే విషయంలో క్లారిటీ ఉంది. కెరీర్ లో హండ్రెడ్ పర్సెంట్ లవ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ లాంటి హిట్లు కేవలం ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్స్ అనే కోణంలోనే కనిపించవచ్చు. కానీ ఈగోలకు పోకుండా సునీల్ తో స్క్రీన్ షేర్ చేసుకుని తడాకా లాంటి మాస్ మూవీతోనూ మెప్పించడం మర్చిపోకూడదు. ఆటోనగర్ సూర్య, బెజవాడ, దడ, సవ్యసాచి వగైరాలు దర్శకుల తప్పిదాలే కానీ ఛైతన్య నటన మీద ఫిర్యాదు రాలేదు.

ప్రయోగాలు అవసరమే. అలా అని పూర్తిగా వాటికే మొగ్గు చూపితే మాస్ కొంత దూరమయ్యే రిస్క్ ఉంది. శివ తర్వాత నాగార్జున తమిళ మలయాళం డైరెక్టర్లతో చాలా ఎక్స్ పరిమెంట్లు చేశారు. పేరొచ్చింది కానీ వసూళ్లు కురవలేదు. తిరిగి అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఘరానా బుల్లోడు లాంటి కమర్షియల్ చిత్రాలతోనే మార్కెట్ స్టామినా పెరిగింది. అన్ని వర్గాలకు చేరువ కావాలంటే ఇలాంటి బాలన్సింగ్ చాలా అవసరం.

చైతన్య ఈ తరహా ప్లానింగ్ మీద దృష్టి సారించాలి. తను లయ తప్పుతున్న అడుగులను సరి చేసుకోవాలి.

ఒకపక్క తమ్మడు ఇంకా ప్రారంభంలోనే ఉన్నాడు కాబట్టి పెద్దోడిగా అక్కినేని లెగసిని మోసే బరువు ముందు చైతన్య మీదే ఉంది. బయట ఎంత సౌమ్యంగా ఉన్నా స్క్రిప్ట్ ల విషయంలో కఠినంగా ఉండాలి. కాంబోల క్రేజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయొచ్చేమో కానీ మొదటి రోజు ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేం. ఇక్కడ కంటెంటే ముఖ్యం. ఆ తర్వాతే ఏదైనా. ఇంకా బోలెడు వయసుంది. బ్రేక్ దక్కాలని కోరుకునే ఫ్యాన్ బేస్ అండదండలున్నాయి.

బురదలో నడుస్తున్నామని తెలిసినప్పుడు బూట్లు వదిలేసి వెళ్ళాలి. మనల్ని దర్శకులు పక్కదారి పట్టిస్తున్నారని అర్థమవుతున్నప్పుడు స్క్రిప్ట్ లను సీరియస్ గా పోస్ట్ మార్టం చేయాలి. ధూమపానం కన్నా గుడ్డినమ్మకం చాలా ప్రమాదమైనది.