Naga Babu talks About Quitting Jabardasthతెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్` లో నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈరోజు ప్రసారం కాబోతున్న చివరి ఎపిసోడ్ తో షో నుండి తప్పుకోబోతున్నారు. దీనిపై రకరకాల ఊహాగానాలు ఉండగా ఆయన వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“2013 నుంచి 2019 వరకు `జబర్దస్త్‌`తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. సృజనాత్మక విభేదాల వల్లే బయటకు రావాల్సి వచ్చింది. దీంట్లో ఎవరి తప్పూ లేదు,” అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రెమ్యూనరేషన్ వల్లే నాగబాబు తప్పుకున్నారు అనే దానిపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.

“నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ షోకు వచ్చాను. కామెడీపై నాకు ఉన్న ఆసక్తి చూసి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి అవకాశం ఇచ్చారు. నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. పారితోషికం వల్లే `జబర్దస్త్`ను వదిలేస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదు,” అని చెప్పుకొచ్చారు.

అయితే స్థాయికి తగ్గ పారితోషికం కాదు అన్న దానిపై కొందరు నాగబాబుని విమర్శిస్తున్నారు. “జబర్దస్త్ ముందు నాగబాబు స్థాయి ఏంటి? సినిమాలలో అవకాశాలు లేవు. నిర్మాతగా ప్లాపులు ఇచ్చి పీకల్లోతూ అప్పుల్లో ఉన్నారు. చిరంజీవి తమ్ముడు అనేది తప్ప ఏది నాగబాబుకు అనుకూలంగా లేదు. ఇంక స్థాయి ఏంటి? చిరంజీవి తమ్ముడు అనడం వల్ల అవకాశాలు రావు అని అప్పుడే తేలిపోయాయి కదా? జబర్దస్త్ వల్లే ఆయనకు క్యారెక్టర్ వేషాలు కూడా వచ్చాయి,” అని కొందరు విమర్శిస్తున్నారు.