Naga Babu says Pawan kalyan doesn't have Money right nowఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క జనసేన నాయకుడిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ దగ్గరా ప్రస్తుతం పైసా లేదంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఇవాళ హైదరాబాద్ లో పవన్ మీద రాసిన ఓ పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయన ఈ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకో ఇరవై రోజులో ముగియనున్న ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించుకున్న హీరో రెమ్యునరేషన్ పరంగా పవనేనని కుండబద్దలు కొట్టేశారు. కానీ ఇప్పుడు చేతిలో డబ్బుల్లేవని అంటున్నారు.

అంతేకాదు కోరుకుంటే చాలా సుఖంగా దర్జాగా లగ్జరిగా జీవితాన్ని గడపగలిగే స్టార్ డం స్టేటస్ ఉన్నప్పటికీ పవన్ అడిగినదంతా ఖర్చు పెడుతూ ఇప్పుడీ పరిస్థితి తెచ్చుకున్నాడని, అది కేవలం ప్రజల కోసమేనని సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అన్నారు. నిజానికి పవన్ రేంజ్ లో ఏడాదికి మూడు సినిమాలు చేసినా ఈజీగా రెండు వందల కోట్లకు పైగా వెనకేసుకోవచ్చు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి బడ్జెట్ డిమాండ్ చేయని రీమేకులతో ఇది ఇంకా సులభం. నిర్మాతలు ఎక్కువ ఇవ్వడానికి సైతం సిద్ధపడతారు.

పవన్ పార్టీ తరఫున అధికార పార్టీ బాధితులకు అందిస్తున్న ఆర్థిక సహాయం, ఎక్కడైనా ప్రజా పర్యటనలు చేయాల్సి వచ్చినప్పుడు పెడుతున్న ఖర్చు కేవలం లక్షల్లో ఉండటం లేదు. కోట్లు దాటిపోతోంది. ఇటీవలే తయారు చేయించిన వారాహి వాహనంతో మొదలుపెట్టి అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు లీగల్ హెల్ప్ చేయడం దాకా ప్రతిదీ డబ్బుతో ముడిపడిందే. విరాళాలతో ఇవన్నీ నడవవు. జనసేన దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కాదు. ఒక్క సీటు గెలవలేదనే అపవాదు నుంచి ప్రత్యర్థిని బలంగా ఎదిరించే సవాల్ తో వెళ్తోంది.

అందుకే అభిమానులు ఎంతగా మొత్తుకుంటున్నా తేరి, వినోదయ సితం లాంటి రీమేకులను ఒప్పేసుకోవాల్సి వస్తోంది. తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసి ఆదాయం గడించాలంటే ఇంతకన్నా మార్గం లేదు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వాటి బడ్జెట్ లతో సంబంధం లేకుండా కొంచెం అటుఇటుగా ఒకే రేట్ కు అమ్ముడుపోతాయి. అలాంటప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు. ప్యాన్ ఇండియా స్టార్ లాగా సినిమాలే ప్రపంచమైతే ఏ కొరతా ఉండదు. కానీ బాధ్యతలు ఎక్కువున్నప్పుడు సొమ్ములూ తగ్గుతాయి మరి.