Naga Babu - Vijaya Sai Reddyమొన్న ఆ మధ్య పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉన్నట్టుంది ఎందుకో వైకాపాను పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా టార్గెట్ చేశారు. అయితే జగన్ కూడా దానికి గట్టిగానే స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే చివరి నిముషంలో పవన్ కళ్యాణ్ తనని తాను నియంత్రించుకోవడంతో ఆ గొడవ అక్కడితో సమసిపోయింది. ఇది ఇలా ఉండగా జనసేన వైకాపాల మధ్య పొత్తుకు తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోడీ ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా ఒక టీవీ ఛానల్ ఇచ్చిన కథనం ప్రకారం మెగా బ్రదర్ నాగబాబు, వైకాపాలోని నెంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డి ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో సమావేశమయ్యారట. తెలంగాణాలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మై హోమ్ రామేశ్వరరావు కూడా ఈ సమావేశంలో ఉన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన వైకాపా పొత్తు ఆవశ్యకత గురించి వారు చర్చించినట్టు సమాచారం. విపక్షాలు కలిసి పని చేస్తేనే చంద్రబాబును ఓడించగలమని ఇరు వర్గాల వారికి నచ్చచెప్పే ప్రయత్నం జరిగిందట.

మలి విడత సమావేశంలో కేటీఆర్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారని ఆ వార్త ఛానల్ చెప్పింది. ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా కుటుంబసభ్యులను పక్కన పెట్టినా వారంతా జనసేన కోసం తెరచాటున పని చేస్తున్నారనే వదంతులు రాజకీయ వర్గాలలో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ దీనిని పార్టీ తరపున ఖండించారు. అసలు అలాంటి సమావేశమేది జరగలేదని అన్నారు.

“నాగబాబు గారు పవన్ కళ్యాణ్ కి బ్రదర్ గానీ జనసేన పార్టీకి కాదు. మా దగ్గర క్లియర్ గా ఆ డిఫరెన్స్ ఉంది. మా తరపున అలాంటి దేమైనా మాట్లాడాల్సి వస్తే పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది ఒకటి ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారే నేరుగా మాట్లాడతారు. మా తరపున ఎవరూ మాట్లాడనవసరం లేదు. ఇప్పటికైతే అటువంటి ప్రయత్నాలు, చర్చలు గానీ జరగడం లేదు.,” అని వివరించే పని చేశారు శ్రీధర్. మరోవైపు కేసీఆర్ చంద్రబాబు నాయుడుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.