Naga-Babu-Konidelaజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనకు వస్తున్నప్పుడు విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలు, ఆ తర్వాత నోవాటెల్ హోటల్‌లో తమను నిర్బందించడం, జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయడం, తమను బలవంతంగా విశాఖ నుంచి తిప్పి పంపించేయడం తదితర ఘటనలపై నాగబాబు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నిన్న మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ, “మొన్న శనివారం వారు విశాఖలో గర్జన పేరుతో ఆడిన డ్రామా రక్తి కట్టించే ప్రయత్నాలు చేశారు. కానీ విశాఖ ప్రజలు వారిని పట్టించుకోలేదు. కనుక పవన్‌ కళ్యాణ్‌ విశాఖకు వస్తే అల్లర్లు జరుగుతాయని నిరూపించేందుకుగాను మంత్రులు, వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ విమానాశ్రయంలో దిగే సమయానికే చేరుకొని అక్కడ మా జనసేన కార్యకర్తల ముందు నుంచి వెళ్ళారు.

అంతకు ముందే వారందరూ గర్జన సభలో పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి నానా మాటలు అన్నారు. కనుక విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్న మా జనసేన కార్యకర్తలు మైండ్‌లో అది ఇంకా ఫ్రెష్ గా ఉంది. కనుక వారు ఆవేశంగా స్పందించడం సహజమే. నిజానికి ఈవిదంగా జరుగుతుందని, జరగాలనే వైసీపీ నేతలు తెలిసే పక్కా ప్లాన్‌తో చేశారు. లేని సమస్యను సృష్టించడం దాంతో ప్రజల దృష్టిని మళ్లించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యే. ఆరోజున కూడా అదే చేసిందని భావిస్తున్నాను,” అని అన్నారు.

ఇక నోవాటెల్ హోటల్‌లో తమను నిర్బందించి, తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ఆ తర్వాత తమతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతీ పావుగంటకు, అరగంటకు పోలీసు అధికారులు హడావుడిగా హోటల్‌ లోపలకి వచ్చిపోతూ సంప్రదింపుల పేరిట హడావుడి చేయడం కూడా పెద్ద డ్రామాయే అని నాగబాబు ఎద్దేవా చేశారు. బయట పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, జనసేన కార్యకర్తలకు హోటల్‌ లోపల ఏదో జరిగిపోతోందనే ఆందోళన కలిగించేందుకు, పవన్‌ కళ్యాణ్‌ విషయంలో పోలీసులు చాలా సమర్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలను నమ్మించేందుకే పోలీస్ అధికారులు ఈ డ్రామాలు ఆడుతున్నారని తాము గమనించామని నాగబాబు చెప్పారు. అయితే వైసీపీ నేతలు, పోలీసులు కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలు చాలా నిబ్బరంగా, సంయమనంగా వ్యవహరించారని నాగబాబు అన్నారు.