Naga-Babu-Konidela-JanaSenaఇక నుంచి ఏపీలో రాజకీయ పార్టీలు రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు సునిశిత విమర్శలు చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుండటంతో అధికార వైసీపీలో తీవ్ర అభద్రతా భావం నెలకొంది. ఈ జీవో జారీకి అదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మన దేశంలో భిన్న మతాలు, సంస్కృతులవాళ్ళు నిత్యం ఏవో కార్యక్రమాలు జరుపుకొంటూనే ఉంటారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా ప్రజలతో మమేకం అయ్యేందుకు రోడ్ షోలు, సభలు, సమావేశాలు పెట్టుకొంటాయి. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు. ఎన్నో దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. కనుక వాటిని మార్చాల్సిన అవసరం లేదు.

కందుకూరులో చంద్రబాబు నాయుడు రోడ్ షోలో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు కొందరు మృతి చెందినప్పుడు, మాకు అప్పుడే తర్వాత సభలో ఏదో జరగబోతోందనే చిన్న అనుమానం కలిగింది. గుంటూరు సభలో సరిగ్గా అలాగే జరిగింది. కనుక దీని వెనుక రాజకీయ కుట్ర ఉందా లేక నిజంగానే తొక్కిసలాట జరిగిందా?అనేది పోలీసులు దర్యాప్తు చేసి తేల్చాలి.

అయితే ఈ వంకతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు సభలు, రోడ్ షోలు నిర్వహించకుండా జీవో జారీ చేసి అడ్డుకోవాలనుకోవడం గమనిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశపాలన సాగుతోందా?అనే సందేహం కలుగుతోంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడం రాజకీయ పార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కనుక ఏపీలో ప్రతిపక్ష పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో కోర్టులలో నిలుస్తుందా?

ఆనాడు టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకోవడానికి అనుమతించారు కదా?మరి ఇప్పుడు ప్రతిపక్షాలను ఎందుకు అడ్డుకోవాలనుకొంటున్నారు? ఇప్పుడు మీరు అడ్డుకొంటున్నట్లే ఆనాడు టిడిపి ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకొని ఉంటే ఏం చేయగలిగేవారు?” అని నాగబాబు ప్రశ్నించారు.