Nandamuri Balakrishna - Naga Babuమెగా బ్రదర్‌ నాగబాబు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభుకు ఇచ్చిన ఒక్క వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రభు రెట్టించి అడుగగా మరో సీనియర్ నటుడు బాలయ్య మాత్రమే తెలుసు అన్నట్టు సమాధానం చెప్పారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు మాత్రం నాగబాబుకు ఇంత అహంకారం పనికిరాదని కామెంట్ చేస్తున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలీదన్న బాలయ్య కామెంట్ కు ఇది చెంప పెట్టు వంటిదని చెప్పుకొస్తున్నారు. రెండు వైపులా వారు దీనిగురించి కొట్టుకుంటుండగానే నాగబాబు మరోసారి ఇంకో వీడియో విడుదల చేశాడు. బాలయ్య ఎవరో తెలీదు అనడమే తప్పే అని, ఆయన గొప్ప కమెడియన్ అని అన్నారు.

తన నటనలో ప్రతి అణువణువునా హాస్యం ఉంటుందని ఎద్దేవా చేసినట్టే చేసి చివర్లో ఇంకో సీనియర్ నటుడు బాలకృష్ణ ఫోటో చూపించి తనకు నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో తెలీదు అని చెప్పకనే చెప్పారు. దీనితో సోషల్ మీడియా మరింత వేడెక్కింది. అయితే బాలయ్య మీద నాగబాబు కామెంట్లు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవే అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కమ్మ, కాపు కులాల మధ్య ఎప్పుడూ ఉండే తరతమ్యాన్ని పెద్దదిగా చేసి, కాపులు జనసేన వైపు మరింత సంఘటితం చేసే ప్రయత్నమిది అని అనుమానిస్తున్నారు.

గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ ను కూడా ఇదే ఉద్దేశంతో టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. చింతమనేని కూడా ఆవేశపరుడు కాబట్టి గట్టిగా స్పందిస్తారని తద్వారా కాగల కార్యం నెరవేరుతుందని భావించారు. అయితే ఎలాగో ఆయన దాని మీద గట్టిగా స్పందించలేదు. ఇప్పుడు ఆవేశపరుడిగా పేరు గాంచిన బాలయ్యను కూడా ఇదే ఉద్దేశంతో టార్గెట్ చేసినట్టు టీడీపీ వారి అనుమానం. దీనికి బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి. జనసేనకు అవకాశం ఇస్తారా?