Nadendla Mnoharకేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై నిర్ణయం తీసుకోవడంతో మరోసారి బీజేపీ ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబడింది. పొత్తు కారణంగా బీజేపీతో పాటు ఈసారి జనసేన కూడా దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం తెరమీదకు రాగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి నిర్ణయంపై మరోసారి ఆలోచించాల్సిందిగా అమిత్ షాకి చెప్పొచ్చారు. అంతకుమించి ఏమి చెయ్యలేని పరిస్థితి.

అయితే ప్రతిపక్షాలు దానిపై ఒత్తిడి పెంచడంతో జనసేన కూడా ఇబ్బంది పడుతుంది. ఒక టీవీ ఇంటర్వ్యూ లో ఈ విషయం పై కేంద్రం ఆలోచిస్తుందని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. అయితే పదే పదే సదరు యాంకర్ ప్రశ్నించడంతో ఒక వేళ కేంద్రం ఈ విషయంగా ముందుకు వెళ్ళాలనే నిర్ణయిస్తే తాము ప్రజల పక్షాన్నే ఉండి పోరాటం చేస్తామని చెప్పారు.

ఒకవిధంగా ఇది బీజేపీకి వార్నింగ్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ విషయంగా బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలిసే ప్రయత్నం చేస్తే కనీసం వారికి సమయం కూడా ఇవ్వలేదు. ఇదే విషయంగా వారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ని కలిస్తే వారిపై సీరియస్ అయ్యారట. మీరు ఏపీ పార్టీ వ్యవహారాలు మాట్లాడండి కానీ ప్రభుత్వ విధాన నిర్ణయాలపై జోక్యం చేసుకోవద్దు అని ఒకింత కఠినంగా నే చెప్పారట.

దీనితో ఈ విషయం పై కేంద్రానికి ఆలోచన చేసే ఉద్దేశంలో లేదని అర్ధం అవుతుంది. అదే జరిగితే జనసేన పార్టీకి ఇబ్బందే అని చెప్పుకోవాలి. అసలు అంతవరకు వస్తే పొత్తుపై పవన్ కళ్యాణ్ కఠిన నిర్ణయం తీసుకోగలరా అనేది కూడా చూడాలి. వచ్చే నెల లో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండడంతో స్టీల్ ప్లాంట్ విషయం మరింత గా ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు మిగతా పార్టీలు. అది మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుంది.