Nadendla Manohar TDP covert in Janasena పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం ఏర్పడిన కొత్తలో ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండే వారు. అప్పట్లో ఆ పార్టీకి ఆయనే నోరు, చెవులు. అటువంటి పరకాల ఒకరోజు ఉన్న ఫలంగా పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోశారు. ప్రజారాజ్యం ఒక విషవృక్షం. సీట్లు అమ్ముకుంటున్నారు అంటూ విమర్శలు చేశారు. అక్కడనుండి ఆ పార్టీ పతనం ప్రారంభం అయ్యింది. ఆ తరువాత 2009 ఎన్నికలలో ఓడిపోవడం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి వారు పరకాల గురించి పదే పదే మాట్లాడటం మన అందరికీ తెలిసిందే.

ఇప్పుడు జనసేనకు కూడా అదే జరగబోతుందా? గత కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ వెంటే కనిపిస్తూ ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీ మారడానికి సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన జగన్ పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కొన్ని నెలలుగా ఆయన పవన్ పక్కనే కనిపిస్తున్నారు. జనసేనలో నంబర్ టు, పవన్ కు రాజకీయ మార్గదర్శి అంటున్న ఈ సమయంలో వస్తున్న ఈ వార్తలు అభిమానులలో కలకలం రేపుతోంది. నాదెండ్ల పరకాల లాగా విమర్శలు చేసే మనిషి కాదు.

అయితే పార్టీలో ఇంత కీలకమైన వ్యక్తి వెళ్ళిపోతే అది ప్రజలకు కచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఇది జరగకూడదని వారు కోరుకుంటున్నారు. జనసేన పార్టీలో చేరిన కీలక నేతలు ఆకుల సత్యనారాయణ, రావేల కిషోర్ బాబు కూడా ఆ పార్టీలో యాక్టీవ్ గా కనిపించడం లేదు. ఇప్పటివరకూ కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు మీద కూడా క్లారిటీ లేదు. ఈ క్రమంలో నాదేండ్ల గురించి వస్తున్న ఈ వార్తలు కలకలం రేపుతున్నాయి. నాదెండ్ల విషయంలో జరుగుతున్న ప్రచారం పుకార్లే అనుకోవాలో లేక నిజంగానే నాదెండ్ల బయటకే రానున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.