Nadendla Manohar Comments On KCR BRSజనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, బిఆర్ఎస్‌, వైసీపీ, సిఎం జగన్మోహన్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్‌ టిఆర్ఎస్‌ని స్థాపించి ఒక్కటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. రాష్ట్ర విభజన కారణంగా మనం చాలా నష్టపోయాము. అయినప్పటికీ ఏదోలా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొందామని ప్రయత్నిస్తుంటే కేసీఆర్‌ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. మనకి రావలసిన నీళ్ళు ఇవ్వరు. రావలసిన ఆస్తులలో వాటాని ఇవ్వరు. పైగా మనం కట్టుకొంటున్న సాగునీటి ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెపుతూ కోర్టులకి వెళుతుంటారు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు వస్తున్నట్లు? ఏమి చేయాలనుకొంటున్నట్లు?

ఆయన బంగారి తెలంగాణ సాధించుకొందామని అంటున్నారే తప్ప బంగారు ఆంధ్రప్రదేశ్‌ అని అనడం లేదు కదా? మొత్తం దేశాన్ని ఉద్దరిస్తానని చెపుతూ బయలుదేరుతున్న కేసీఆర్‌ ముందు ఏపీకి ఏం చేయాలనుకొంటున్నారో చెప్పాలి. ఇక సిఎం జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి చెందిన విలువైన ఆస్తులలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేసీఆర్‌కి అప్పజెప్పారు. అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి సాయపడేందుకే కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పేరుతో రాష్ట్రానికి వస్తున్నారని భావిస్తున్నాము. ఇద్దరూ కలిసి జనసేన ఓట్లని చీల్చి మా పార్టీని దెబ్బతీయడానికె చేతులు కలుపుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కేసీఆర్‌ రావడం లేదు. ఒకవేళ కేసీఆర్‌కి నిజాయితీ ఉంటే ముందు ఈ ఆస్తుల పంపకం, నీళ్ళ పంపకాల గురించి మాట్లాడమనండి. ఏపీకి చేసిన అన్యాయం ఏవిదంగా సవరించుకొంటారో చెప్పమనండి,” అని అన్నారు.

కేసీఆర్‌ గుణాత్మకమైన మార్పు వంటి సరికొత్త పదాలు సృష్టించి తన మాటకారితనంతో ప్రజలని ఆకర్షించడంలో దిట్ట! అయితే సొంత రాష్ట్రమైన తెలంగాణలోనే నేడు ఆయన నిరంకుశవైఖరిని, కుటిల రాజకీయాలని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. రాష్ట్రంలో తనకి, తన పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయని కేసీఆర్‌ గుర్తించినప్పుడల్లా ఏదో ఒక అనూహ్యమైన వ్యూహం అమలుచేస్తుంటారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలకి ముందు దళిత బంధు, మునుగోడు ఉపఎన్నికలకి ముందు గిరిజన బంధు ఇందుకు చిన్న ఉదాహరణలు.

టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చి గుణాత్మకమైన మార్పు కోసం అంటూ జాతీయ రాజకీయాలలో హడావుడి చేయడం కూడా అందుకే అని తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపి, ఆయనతో కలిసి ఉద్యమాలు చేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వాదిస్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెందితే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. కనుక నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగా కేసీఆర్‌ ఓ రాజకీయ వ్యూహం, ప్రయోజనం కోసం ఏపీలోకి వస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.